SIT Inquiry on PDS Rice Smuggling :కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాల పరిశీలన జరగుతుండగా సిట్ విచారణ దూకుడుగా సాగే అవకాశం ఉంది. అక్రమాలకు అండదండగా ఉంటున్న పెద్దలపాత్ర తేలనుంది. రాష్ట్రంలో ఎన్ని పోర్టులున్నా వివాదాల సుడిలో చిక్కింది మాత్రం కాకినాడ పోర్టే.
రాష్ట్రప్రభుత్వ మారిటైం బోర్డు పర్యవేక్షణలోని కాకినాడ పోర్టును ప్రైవేట్ వ్యక్తులు, రాజకీయ నేతలు తమ గుప్పెట్లోకి తీసుకుని అక్రమ ఎగుమతులు, అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా. మార్చారనే విమర్శలున్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతుల ముసుగులో పేదల బియ్యాన్ని దేశందాటించిన అక్రమార్కులు ఆటలు ఇప్పుడూ అలాగే సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో పౌరసరఫరాల వ్యవస్థలో క్షేత్రస్థాయి లోపాలు కొందరికి ఆదాయవనరుగా మారాయి.
పేదలకు పంపిణీ చేసే కేజీ బియ్యానికి ప్రభుత్వం రూ.43.50 వెచ్చిస్తుంది. దానిని లబ్ధిదారుల నుంచి కొన్ని ముఠాలు కేజీ రూ.10కి కొంటున్నాయి. ఆ బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ చేయించి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి. దీంతో రాజకీయదన్నుతో రాష్ట్ర నలుమూలల నుంచి కాకినాడకు అక్రమ నిల్వలు చేరుకుంటున్నాయి. పోర్టు, కస్టమ్స్, మెరైన్, పౌరసరఫరాలు, పన్నుల శాఖ, రవాణా, పోలీసులు ఇలా అందరి తనిఖీలు సవ్యంగానే ఉన్నట్లు చెబుతున్నాయి.
PDS Rice Smuggling in Kakinada Port : కానీ అక్రమ నిల్వలు ఇన్ని వ్యవస్థలు దాటి పోర్టులోకి ఎలా చేరుతున్నాయనే ప్రశ్నకు సమాధానం దొరకడంలేదు. లంచాల వ్యవహారంలో కాకినాడ పోర్టులోని కస్టమ్స్ కార్యాలయ ఉద్యోగులు ఈ ఏడాది అక్టోబరు 5న సీబీఐకి చిక్కారు. పోర్టు కార్యకలాపాలను పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల్లో అవినీతి తారస్థాయిలో ఉన్నా ప్రక్షాళన దిశగా చర్యల్లేకపోవడంతో అక్రమాలు ఆగడంలేదు.