Farmer Pulls 101 Sacks of Sorghum with a Cart : పూర్వం రోజుల్లో ఎడ్ల బండ్లే ప్రధాన రవాణా సాధనంగా ఉండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా ఎంత దూరమైనా ఎడ్ల బండి మీదే ప్రయాణం సాగించేవారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రకాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, నేటికీ చాలా మంది రైతులు పల్లెల్లో తమ వడ్ల బస్తాలు ఇంటికి చేర్చడానికి, అలాగే ఎరువుల బస్తాలు పొలానికి తరలించడానికి ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తున్నారు.
సాధారణంగా పంట చేతికి వచ్చాక రైతులు ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా వడ్లు, జొన్న బస్తాలు, పత్తి సంచులను మార్కెట్‌కు లేదా ఇంటికి తరలిస్తుంటారు. ఒక ఎడ్ల బండి మీద దాదాపు 10 నుంచి 15 వరకు బస్తాలు మాత్రమే పడుతుంటాయి. పొలం వద్ద ఒక వంద బస్తాలు ఉన్నాయి అనుకుంటే, వాటిని తరలించడానికి ఒక ఎడ్ల బండి మీద 5 లేదా 6 సార్లు చక్కర్లు కొట్టాల్సి ఉంటుంది. కానీ, అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు తన వద్ద ఉన్న 101 జొన్న బస్తాలను తరలించడానికి ఒక చక్కటి ఉపాయం చేశారు. ఈ ఉపాయం ద్వారా ఒకేసారి అన్ని బస్తాలను ఇంటికి తరలించారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే వ్యవసాయంలో ఎద్దుల పాత్ర ఎంతో ఉందని, వాటిని పరిరక్షించుకోవాలన్నదే తమ ఉద్దేశమని రైతు పూజారి శీన తెలిపాడు.
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగిలో పూజారి శీన జొన్నలు పండించాడు. ఈయన 101 జొన్న బస్తాలను ఐదు ఎడ్లబండ్లలో వేసి బండెనక బండి కట్టి ఒక వైపు ఎద్దును కట్టి, మరోవైపు మనుషులతో లాగించారు. ఎద్దుల పెంపకంపై ఆయనకు ఉన్న ఉత్సాహం, ప్రేమతో ఎద్దుతో మూడు కిలోమీటర్ల మేర లాగించారు.
ఐదు ఎడ్ల బండ్లను ఒకేసారి లాగుతున్న దృశ్యాన్ని చూడడానికి హావళిగ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా మంది గ్రామ ప్రజలు తరలి వచ్చారు. ఒకవైపు ఎద్దు, మరొవైపు మనుషుల ఐదు బండ్లను లాగుతున్న దృశ్యాన్ని చూసి ఆనందంతో కేకలు వేస్తూ మూడు కిలోమీటర్ల వరకు ఎంతో ఉత్సాహంగా తరలి వెళ్లారు. ఇదంతా చూస్తుంటే గ్రామంలో ఏదైనా పండగ జరుగుతుందేమో అన్న ఫీలింగ్ కలుగుతోంది.
ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు రైతు చక్కటి ఉపాయం చేశాడని అభినందిస్తున్నారు. మరికొందరు రైతు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి, అనే సాంగ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లు ఉన్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈయన తన టాలెంట్‌తో ఎంతో సమయం ఆదా చేసుకున్నారని అంటున్నారు.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారి - రెండు ఖండాలు, 14దేశాల మీదుగా ప్రయాణం
తిరుమలలోని ఈ పెయింటింగ్ ఏమిటో తెలుసా? - 90శాతం మంది భక్తులు ఫెయిల్!