Government Focused On Expansion Of Roads In Palnadu District : రహదారులు లాంటి కనీస మౌలిక వసతులు లేకపోవడంతో పల్నాడులోని అనేక ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ప్రభుత్వం పల్నాడు ప్రాంత పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే కేంద్రాన్ని ఒప్పించి పేరేచర్ల-కొండమోడు 4 లైన్ల రహదారి, వినుకొండ-గుంటూరు 4 లైన్ల రహదారితోపాటు మాచర్ల నియోజకవర్గంలో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చేయడంలో విజయం సాధించింది.
రహదారుల నిర్మాణానికి కేంద్రం నిధులు :పల్నాడు ప్రాంతానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నాణ్యమైన ఖనిజ సంపదతో పాటు పక్కనే నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం పల్నాడు జిల్లా అట్టడుగున ఉంది. యువత ఉపాధి లేక నిరుద్యోగంతో, ప్రజలు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, నీరు అందుబాటులో ఉన్నా రవాణా సదుపాయం అవరోధంగా మారింది. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే మౌలిక వసతుల్లో కీలకమైన రహదారుల నిర్మాణంపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పేరేచర్ల-కొండమోడు మార్గంతోపాటు వినుకొండ-గుంటూరు 4 లైన్ల రహదారి, మాచర్ల నియోజకవర్గంలో 4 ప్రధాన రహదారుల నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు సమకూర్చడంలో సఫలమైంది.
'సంక్రాంతి వరకు గుంతలు పూడ్చేస్తాం- దీపావళికి ఉచిత సిలిడర్ అందుతుంది'
రూ. 881.61కోట్లకు దక్కించుకున్న గుత్తేదారు : పేరేచర్ల-కొండమోడు రహదారిని 49.9 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా విస్తరించేందుకు నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే ఈ రహదారిని భారత్‌మాల కింద ఎంపిక చేశారు. గతేడాది 1032.52కోట్ల అంచనాతో టెండరును రాజేంద్రసింగ్ బేంబూ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. నిధులు విడుదల కాక విస్తరణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ అంశంపై తాజాగా సమీక్షించిన రహదారులు, భవనాల శాఖ మంత్రి BC జనార్దన్ రెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలసి భారత్‌మాల కింద ఉన్న రోడ్లను NHO కింద కొనసాగించాలని కోరారు. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ, స్టాండింగ్ పైనాన్స్ కమిటీ అంగీకరించడంతో నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు ప్రభుత్వం 1032.52కోట్ల అంచనాతో టెండర్లు పిలవగా రూ. 881.61కోట్లకు గుత్తేదారు దక్కించుకున్నారు.
"రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టారు.పేరేచర్ల-కొండమోడు మధ్య నాలుగు లైన్ల రహదారికి రూ. 881.61కోట్లు కేటాయించారు. ఈ రోడ్డు పూర్తయితే తెలంగాణ - ఏపీ రాష్ట్రల మధ్య రాకపోకలు పెరిగివ్యాపారస్తులకులాభం చేకురుతుంది. అలాగే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది." -రాజశేఖర్, పేరేచర్ల వాసి