Internal Marks 9th and 10th at AP : ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తొమ్మిది, పదో తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం 100 మార్కులకు నిర్వహిస్తున్న పరీక్షలను 80 మార్కులకు కుదిస్తారు. మిగతా 20 అంతర్గత మార్కులుగా ఉంటాయి. రాష్ట్రంలో జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్టీ) సిలబస్‌ను అమలుచేస్తున్నా వంద మార్కులకే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈలో అంతర్గత మార్కుల విధానం అమల్లో ఉంది. దీంతో అదే విధానాన్ని తీసుకువచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానంలో అంతర్గత మార్కుల విధానం ఉంది. ప్రైవేట్ బడులు ఎక్కువగా మార్కులు వేసుకుంటున్నాయని 2019లో పదోతరగతిలో ఆ విధానాన్ని అప్పటి సర్కార్ రద్దుచేసింది. దీంతోపాటు బిట్ పేపర్ విధానాన్నీ తొలగించింది. ఇప్పుడు ఎన్‌సీఈఆర్టీ సిలబస్, సీసీఈ విధానం అమలుచేస్తున్నందున అంతర్గత మార్కులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
పకడ్బందీ విధానం :అంతర్గత మార్కులను ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వేసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ విధానాన్ని తీసుకురావాలని సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఫార్మెటివ్ పరీక్షల విధానంలో మార్పులు చేసిన ప్రభుత్వం రాతపరీక్షకు మార్కులు పెంచింది. ఫార్మెటివ్-3 వరకు రాత పరీక్ష 20, ప్రాజెక్టులకు 10, నోటుబుక్స్ ఇతరత్ర వాటికి 10, తరగతిలో విద్యార్థి స్పందనకు 10 మార్కుల చొప్పున ఉండేవి.