ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎలక్ట్రానిక్​ వ్యర్థాలను ఇచ్చేద్దాం - ప్రమాదాన్ని ఆరికడదాం' - సత్ఫలితాలిస్తున్న కలెక్టర్​ నిర్ణయం - E Waste Recycling in AP - E WASTE RECYCLING IN AP

E-Waste Recycling in AP : ఎలక్ట్రానిక్‌ యుగంలో పలు నూతన ఆవిష్కరణలు నిత్యకృత్యమయ్యాయి. తద్వారా ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం పెరగడం వల్ల వాటి వ్యర్థాలూ ఎక్కువై జనజీవనానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రథమంగా కృష్ణా జిల్లాలో వీటి సేకరణకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా జిల్లాలో 11 టన్నులకుపైగా ఈ-వ్యర్థాలు రీసైక్లింగ్​కు రావడం విశేషం.

E Waste Recycling in AP
E Waste Recycling in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 12:59 PM IST

E-Waste Recycling Krishna District : స్వచ్ఛతాహీ సేవలో భాగంగా ప్రతి ప్రాంతం పరిశుభ్రంగా ఉండాలన్నది సర్కార్ లక్ష్యం. ఇందులో భాగంగానే కృష్ణా జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటిలోనూ ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు విపరీతంగా పేరుకుపోతున్నాయి. వీటిలోని హానికర రసాయన విడిభాగాల నుంచి ప్రమాదం పొంచి ఉంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం వాటిని సేకరించి రీసైక్లింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ-వ్యర్థాల సేకరణకు కృష్ణా జిల్లాలో శ్రీకారం చుట్టారు.

ప్రమాదాన్ని అరికట్టేలా? :ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ టీవీలు, సెల్​ఫోన్​లు, కంప్యూటర్లు, కుక్కర్లు, మిక్సీలు, ల్యాప్‌టాప్‌లు ఇలా అనేక ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఉంటున్నాయి. పాడైన, కాలం చెల్లిన ఆ పరికరాలను చాలా మంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. తడి, పొడి చెత్త విడివిడిగా సేకరిస్తున్నా వాటిలో ప్రమాదకర రసాయనాలతో మిళితమైన ఈ-వ్యర్థాలు కలిసిపోతున్నాయి. ఇది పర్యావరణానికి ఎంతో హాని చేస్తుంది. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ-వ్యర్థాల సేకరణపై విధి విధానాలు రూపొందించారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో దుకాణాలు, ఇళ్లకు వెళ్లి ఎలక్ట్రానిక్ వ్యర్థాలు సేకరించేలా కలెక్టర్​ చర్యలు తీసుకున్నారు.

పది చోట్ల కేంద్రాల ఏర్పాటు : మొదట జిల్లా వ్యాప్తంగా సేకరించిన వాటిని మచిలీపట్నం తరలించారు. వీటిలో ల్యాప్​టాప్​లు, కంప్యూటర్లు, టీవీలు, కుక్కర్లు, మిక్సీలు, వాషింగ్‌ మిషన్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్లు ఉన్నాయి. ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రెండో విడతగా జిల్లాలోని పది మేజర్‌ పంచాయతీల్లో ఈ-వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. బందరు మండలం అవనిగడ్డ, పోతేపల్లి, బాపులపాడు, చల్లపల్లి, గుడివాడ మండలం గుడ్లవల్లేరు, మల్లాయిపాలెం, పామర్రు, నాగాయలంక, పెదపారుపూడి, ఉంగుటూరు, పంచాయతీల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ప్రజల నుంచి విశేష స్పందన :కృష్ణా జిల్లా వ్యాప్తంగా సేకరించిన ఈ-వ్యర్థాలను వాహనాల ద్వారా బందరు మండలంలోని పోతేపల్లికి తరలించి అక్కడ నిల్వ చేశారు. మొదట ఒక టన్ను సేకరించగలమని అధికారులు భావించారు. కానీ 11 టన్నులకుపైగా రావడం విశేషం. ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో తాడిగడప పురపాలక సంఘ పరిధిలో అత్యధికంగా 843 కేజీలు సమీకరించారు. ఉయ్యూరులో అత్యల్పంగా 100 కేజీలు సేకరించారు.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లోని 497 గ్రామ పంచాయతీల పరిధిలోనూ ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల పరంగా చూస్తే మొవ్వ మండలంలో అత్యధికంగా 781 కేజీలు సమీకరించారు. నందివాడ మండలంలో అత్యల్పంగా 60 కేజీలు మాత్రమే సేకరించారు. వీటిని రీసైక్లింగ్‌ చేసేందుకు అధికారులు ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.

స్వచ్ఛందంగా ముందుకు రావాలి :ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ-వ్యర్థాలను కేంద్రాల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఆ దిశగా వారిని చైతన్యం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రజలు భావించాలని పేర్కొన్నారు. వీటి సేకరణకు తొలుత పది మేజర్‌ పంచాయతీల్లో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. తర్వాత అన్ని చోట్లా వీటిని ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామని బాలాజీ వెల్లడించారు.

E-waste Recycling: ఎలక్ట్రానిక్​ వ్యర్థంలోనూ పరమార్థం!

ఈ-వ్యర్థాల పునర్వినియోగమే మానవాళికి క్షేమం

ABOUT THE AUTHOR

...view details