Building and Layout Approvals in AP : రాష్ట్రంలో భవన నిర్మాణాలకు అర్జీల ప్రక్రియను ఏపీ సర్కార్ సులభతరం చేస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే అనుమతులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. అనుమతులకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నారు. డీపీఎంఎస్ పోర్టల్‌కే ఇతర ప్రభుత్వశాఖలను అనుసంధానిస్తున్నారు. వాటిద్వారా చకచకా ఎన్‌ఓసీలు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దరఖాస్తుదారుల స్వీయధ్రువీకరణపై 15 మీటర్ల ఎత్తువరకు భవనాలకు అనుమతులు ఇవ్వనున్నారు.
500 చదరపు మీటర్ల విస్తీర్ణం చొప్పున అపార్ట్‌మెంట్లలో సెల్లార్ ఏర్పాటుకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 120 మీటర్ల కంటే ఎత్తైన భవనాల్లో సెట్‌బ్యాక్ 20 మీటర్లకు కుదిస్తున్నారు. నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా ఇప్పటివరకు ప్రతి పది మీటర్ల ఎత్తుకూ సెట్‌బ్యాక్ పెంచుతున్నారు. ఈ సమస్యకు సర్కార్ పరిష్కారం చూపుతోంది. సవరించిన భవన నిర్మాణ నిబంధనలపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యంతరాలు పరిశీలించి జనవరి మొదటివారంలో జీఓ జారీ చేయనుంది.
అనుమతుల్లేని లేఅవుట్ల కట్టడికి రోడ్ల వెడల్పు 30 అడుగులకు తగ్గింపు :ప్రభుత్వశాఖల నుంచి అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ల వెలుస్తున్నాయి. వీటి నియంత్రణకు వాటిలో అంతర్గత రహదారులు 30 అడుగుల వెడల్పుతో వేస్తే సరిపోయేలా నిబంధనలు సడలిస్తోంది. 40 అడుగుల్లో రోడ్లు ఉండాలన్నది ఇప్పటివరకు ఉన్న నిబంధన. దీంతో చాలామంది అనుమతులు తీసుకోకుండా లేఅవుట్లు వేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వశాఖలు ఆదాయం కోల్పోతున్నాయి. అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న ప్రజలు వాటిలో నిర్మాణాలకు అనుమతులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రోడ్ల నిర్మాణ విస్తీర్ణాన్ని 30 అడుగులకు సర్కార్ తగ్గిస్తోంది.
సింగిల్ విండోతో ఉపయోగం ఇలా :బహుళ అంతస్థుల నిర్మాణాలకు ఇప్పటివరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, అగ్నిమాపక శాఖ నుంచి తొలుత ఎన్‌ఓసీ తీసుకున్నాకే డీపీఎంఎస్ పోర్టల్‌లో అర్జీలు చేస్తున్నారు. సింగిల్‌విండో విధానంలో అనుమతులకు దరఖాస్తు అప్‌లోడ్ చేసి ఫీజులు చెల్లిస్తే చాలు. దరఖాస్తు ఇతర ప్రభుత్వశాఖలకు వెళ్తుంది. అధికారులు పరిశీలించి ఎన్‌ఓసీలు జారీచేసేలా సర్కార్ ఏర్పాట్లు చేసింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఇతర శాఖల నుంచి కూడా ఆన్‌లైన్‌లోనే ఇతర అనుమతులు వస్తాయి.
అక్రమాలకు పాల్పడితే జైలే :భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేసిన సర్కార్ ఈ ముసుగులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అంతే కఠినంగా వ్యవహరించనుంది. ప్రభుత్వ స్థలంలో, తప్పుడు దస్తావేజులు సృష్టించి వేరొకరి స్థలంలో నిర్మాణాలకు అనుమతులు తీసుకున్నా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. నిర్మాణాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకున్నాక వాటిపై పునఃపరిశీలన ఉంటుంది. విచారణ కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైతే ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులపై పోలీసు కేసు నమోదుచేసి లైసెన్స్ రద్దు చేయనున్నారు. భవన నిర్మాణ అనుమతులు ఉపసంహరిస్తారు.