AP Government Closing Schools: నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అంటూ కపట ప్రేమ చూపే ముఖ్యమంత్రి జగన్, ఆ వర్గాలకు చదువు అందకుండా చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడం కోసం భవిష్యత్తులో పాఠశాలల, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు తరగతుల విలీనం చేపట్టారు. ప్రాథమిక పాఠశాలలకు కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే 3, 4, 5వ తరగతులను విలీనం చేశారు. దీన్ని 3 కిలోమీటర్ల వరకు విస్తరించేందుకూ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎన్నికల ముందు విలీనం ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఒక్క కిలోమీటరుతోనే నిలిపివేశారు.
విలీనం కోసం కిలోమీటరు దూరంలో ఉండాల్సిన 3, 4, 5 తరగతులను 3 కిలోమీటర్ల దూరం వరకూ ఉండొచ్చని విద్యా హక్కు చట్టంలో సవరణ తీసుకొచ్చారు. తరగతుల విలీనం కారణంగా 1, 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గిపోయి, ఇప్పటికే 118 బడులు మూతపడ్డాయి. మరిన్ని పాఠశాలలు చరిత్రలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి.
విలీనం చేసిన స్కూళ్లు ఎక్కువగా ఎస్సీ, బీసీ కాలనీలకు చెందినవే. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఆర్.ఏనుగుపల్లిలోని యల్లమెల్లివారిపేట, బెల్లంపూడి అరుంధతీయపేట ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా ఎస్సీ ప్రాంతాల్లోనివే. కారుపల్లిపాడులోని ఎంపీపీ పాఠశాల ఎస్సీ, బీసీ ప్రాంతాలకు చెందినది. వీటిల్లో చదివేవారు అందరూ పేదవారే. ఈ స్కూళ్లు మూతపడిన కారణంగా ఆయా వర్గాలకు కచ్చితంగా విద్య దూరమవుతుంది.
76 ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసేందుకు సిద్ధమైన జగన్ సర్కార్
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గొలుగొండపేట ప్రాథమిక పాఠశాల నుంచి గత సంవత్సరం 3, 4, 5 తరగతుల్లోని 21 మంది పిల్లలను సమీపంలోని చినపేట ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. 1, 2 తరగతులు కలిపి 12 మంది విద్యార్థులు ఉండేవారు. గత సంవత్సరం ఇద్దరు సమీప ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిపోగా, మిగిలిన వారు ప్రైవేటు స్కూళ్లలో చేరారు. కొత్తగా ఎవరూ చేరక స్కూల్ మూతపడింది.
వాహనాల రద్దీలోనే వెళ్లాలి:డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం బెల్లంపూడి అరుంధతీయపేటలోని ఎంపీపీ ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులను ఊడిమూడిలోని జడ్పీ హైస్కూల్లో విలీనం చేశారు. విద్యార్థులు నిత్యం రద్దీగా ఉండే రాజవరం-పొదలాడ రహదారిలో వెళ్లాల్సి వస్తోంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కక్షకట్టి మూసేస్తూ:నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కొలుములపేట ఎంపీపీ పాఠశాలలో 25మంది విద్యార్థులు ఉంటే 2022లో 3, 4, 5 తరగతులను చింతలచెరువు హైస్కూల్లో విలీనం చేశారు. 1, 2 తరగతుల్లో ఐదుగురు విద్యార్థులు మిగలగా, వీరు సైతం వేరే స్కూళ్లకు వెళ్లిపోయారు. గత సంవత్సరం జూన్‌లో ఇద్దరు చేరడంతో వీరిని సమీపంలోని ఎంపీపీ స్కూల్లో చేర్పించి, స్కూల్‌ను మూసేశారు.