Janhvi Kapoor Visit Hyderabad : సినీ నటి జాన్వీ కపూర్ హైదరాబాద్‌లో సందడి చేశారు. మధురానగర్‌లోని హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు అరగంట పాటు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆశ్వీరచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాన్వీ కపూర్ ఆలయానికి వచ్చారనే విషయం తెలుసుకుని స్థానికులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జాన్వీతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.
జాన్వీ కపూర్‌కి దైవభక్తి ఎక్కువ. సినిమా షూటింగ్లలో విరామ సమయాల్లో అప్పుడప్పుడు పలు ఆలయాలను సందర్శిస్తుంటారు. ఆ విధంగానే తరచూ తిరుమలను సందర్శిస్తుంటారు. తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. తిరుమల వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుందని జాన్వీ కపూర్ చెప్పారు. అందుకే తరచూ అక్కడికి వెళ్తుంటానని ఆమె పేర్కొన్నారు. ఓ వైపు సినిమా చిత్రీకరణలో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు జాన్వీకపూర్. ఈ క్రమంలోనే తాజాగా మధురానగర్ ఆంజనేయస్వామిని ఆమె దర్శించుకున్నారు. మరోసారి తనకు దైవభక్తి ఎక్కువని చాటుకున్నారు.