Child Marriages in Eluru District : పల్లెల నుంచి నగరాల వరకు గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిగిపోతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు విఫలం అమవుతున్నారు. తల్లిదండ్రులు విచక్షణ కోల్పోయి బంగారు భవిష్యత్తున్న చిన్నారులను పెళ్లి పీటు ఎక్కించి బలి పశువులను చేస్తున్నారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం శ్రీహరిపురంలో ఓ బాలికకు ఆధార్ కార్డులో వయసు మార్చి బాల్యం వివాహం చేసే ప్రయత్నం చేశారు. బాలిక వయసు 13 సంవత్సరాలు కాగా ఆధార్‌లో 18 ఏళ్లు నిండినట్లు మార్చారు. అనంతరం 33 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. గ్రామస్థుల ఫిర్యాదుతో అధికారులు వివాహాన్ని నిలిపివేశారు.
ఆస్తి పోతుందని : తణుకు గ్రామీణ పరిధిలో ఇటీవల 8వ తరగతి చదివే ఓ బాలికకు 31 ఏళ్ల వయసు ఉన్న మేనమామతో పెళ్లి చేశారు. బాలిక తల్లిదండ్రులకు ఆస్తులు, పొలాలు ఉండటంతో బయట వారికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి పోతుందని ఇలా చేశారు. స్థానికంగా ఉన్న అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోలేదని తెలుస్తోంది.
వరుడు మైనర్-వధువు మేజర్ - ప్రేమపెళ్లిలో ట్విస్ట్
తెలిసినా ఆపని ప్రధానోపాధ్యాయిని : ఏలూరు గ్రామీణ పరిధిలో 9వ తరగతి చదివే ఇద్దరు బాలికలకు కొద్ది రోజుల క్రితమే వివాహాలు చేసేశారు. ఈ విషయం తెలిసినా పాఠశాల ప్రధానోపాధ్యాయిని అధికారులకు సమాచారం ఇవ్వలేదు. పైగా పాఠశాలలో చదువుతున్న వారికి వివాహాలు జరిగాయంటే తన ఉద్యోగం పోతోందని వివాహాలు జరగడానికి ముందే వారికి టీసీలు ఇచ్చేశారు.
మైనర్లు గర్భిణులు : గత ఆరు సంవత్సరాలల్లో 968 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆపినవి 96 మాత్రమే. ఉభయ జిల్లాల్లో గత సంవత్సరం దాదాపు వెయ్యి మంది మైనర్లు గర్భిణులు అయ్యారు. అంటే వీరంతా బాల్య వివాహాలు చేసుకున్నవారే. దీన్ని బట్టి జరుగుతున్న బాల్య వివాహాలలో 15 శాతం కూడా అధికారులు గుర్తించడం లేదని తెలుస్తోంది. తల్లిదండ్రులు ఆలోచనా విధానంలో మార్పులు రావాల్సి ఉంది. బాల్య వివాహాలతో చిన్నారుల బంగారు భవిత బుగ్గిపాలవుతోందని గుర్తించాలి. మైనర్లుగానే గర్భిణులు కావడంతో బాలికలు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.
బర్త్ డే పార్టీ అన్నారు.. 35 ఏళ్ల వ్యక్తితో 12 ఏళ్ల బాలికకు పెళ్లి చేశారు..!
సమాచారం ఇవ్వని అధికారులు : బాల్య వివాహాల నియంత్రణకు ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, వీఆర్వో, మహిళా పోలీసు, ఏఎన్‌ఎం నెల వారీ సమావేశాలు నిర్వహించాలి. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అవన్నీ మొక్కుబడిగానే జరుగుతున్నాయి. గ్రామంలో వివాహాలు జరుగుతున్నాయంటే కచ్చితంగా అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా పోలీసు, ఉపాధ్యాయులకు, కార్యదర్శికి తెలిసినా కనీసం అధికారులకు సైతం సమాచారం ఇవ్వడం లేదు. ఉపాధ్యాయులైతే తమ మీదకు నెపం రాకుండా టీసీలు ఇచ్చేసి చేతులు దులుపేసుకుంటున్నారు.
బాల్య వివాహాలను నియంత్రిస్తాం : 2 జిల్లాల్లో అన్ని మండలాల్లో బాల్య వివాహాలు జోరుగా జరుగుతున్నాయి. ఆధార్ కార్డుల్లో వయసు మార్చి మరీ వివాహాలు చేస్తున్నారు. కొంత కాలం క్రితం ఏలూరు గ్రామీణ పరిధిలో 14 ఏళ్ల బాలికకు 18 ఏళ్లుగా మార్చి వివాహం చేశారు. అవగాహనతో 1098 టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేస్తేనే అధికారులు స్పందిస్తున్నారు. దీనిపై ఏలూరు, పశ్చిమ ఐసీడీఎస్ పీడీలు పద్మావతి, సుజాతారాణి మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి, తల్లిదండ్రులకు అవగాహన పెంచి బాల్య వివాహాలను నియంత్రిస్తామని అన్నారు.
బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- ఇకపై చట్టం అమలు ఇలా!