AP As Global Drone Destination State Cabinet Approved the Drone Policy 2024 : డ్రోన్ పాలసీ 2024కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలులోని ఓర్వకల్లులో ఏర్పాటు చేయనున్న డ్రోన్ సిటీలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ చేపట్టింది. 15 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేలమందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా డ్రోన్ పాలసీ రూపొందించారు. వ్యవసాయ రంగంతో పాటు ఇతర అంశాల్లోనూ డ్రోన్ వినియోగంపై చర్యలు చేపడతామంటున్నపెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనశాఖ కార్యదర్శి సురేశ్ కుమార్‌తో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి.
డ్రోన్ తయారీ, సేవల రంగం ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందే రంగంగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా ఈ రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని ఈ రంగంలో దేశానికే తలమానికంగా ఏపీని అభివృద్ధి చేయాలని, ప్రపంచ దేశాలు సైతం డ్రోన్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగంలో ఏపీవైపు చూడాలనే ప్రధాన లక్ష్యాలతో ఈ పాలసీని రూపొందించారు.
డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం - 1000 కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యం
భారీ ప్రోత్సాహకాలు : డ్రోన్ తయారీ రంగంలో రాష్టంలో రూ.వెయ్యి కోట్లకుపైగా పెట్టుబడులు సాధించాలని ఈ పాలసీని రూపొందించారు. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలకు వారి మూలధన పెట్టుబడిపైన రూ.5 కోట్లకు మించకుండా 20 శాతం రాయితీ కల్పించే విధంగా రూపొందించారు. డ్రోన్ తయారీ, సేవల రంగంలో రూ.3 వేల కోట్లకుపైగా రాబడి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
విద్యుత్తు వినియోగంలోనూ రాయితీ : డ్రోన్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు విద్యుత్ వినియోగంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రాయితీని కల్పించనుంది. యూనిట్ విద్యుత్తు ధరలో రూ.1 రాయితీ రూపంలో సంవత్సరానికి రూ.1 లక్షకు మించకుండా ప్రభుత్వం రెండేళ్లపాటు ప్రోత్సాహకం ఇస్తుంది. దీంతోపాటు వంద శాతం ఎస్‌జీఎస్టీ నుంచి మినహాయింపు, భూ బదలాయింపులో స్టాంపు డ్యూటీ పూర్తి మినహాయింపుతోపాటు లీజు ధరల్లో 50శాతం రాయితీ కల్పించనున్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులివ్వనున్నారు.
డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లును డ్రోన్ హబ్‌గా తయారు చేయనున్నారు. 300 ఎకరాల్లో ఇక్కడ డ్రోన్ తయారీ పరిశ్రమలు నెలకొల్పనున్నారు. రాష్ట్రంలో 25 వేల మందికి డ్రోన్ పైలెట్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 20 రిమోట్ పైలెట్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ సంస్థల ద్వారా శిక్షణ పొందేవారికి రూ.2 వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. డ్రోన్ల రంగంలో 15 వేల మంది ప్రత్యక్షంగా, 25 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందేలా చర్యలు చేపట్టనున్నారు.
అంతేకాకుండా డ్రోన్ పరిశోధనలు చేపట్టే విద్యా సంస్థలకు రూ.20 లక్షల పరిశోధన గ్రాంట్‌ను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్ సేవలతో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ పాలసీని రూపొందించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాలు ప్రజలకు మరింత సులభంగా సేవలను అందజేయడానికి వీలుగా డ్రోన్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం ప్రతిశాఖలోనూ ప్రత్యేకించి ఓ డ్రోన్ ఇన్నోవేషన్ అధికారిని నియమించనున్నారు.
"భారత్ భవిష్యత్ బాగుండాలి - ఆ విజయంలో ఏపీ ప్రధాన పాత్ర కావాలి" - విశ్వాసం పెంచిన డ్రోన్ సమ్మిట్