AP DGP Harish Kumar Gupta Focus on Police Behavior :ఎన్నికల వేళ అనుకూలమైన అధికారులుంటే వారిని అడ్డం పెట్టుకొని ఏదోరకంగా గెలవొచ్చనే దురుద్దేశంతో వైఎస్సార్సీపీ నాయకులు షెడ్యూల్ రాకమునుపే వారికి కావాల్సిన అధికారులను ఏరికోరి మరీ తెచ్చిపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీతో అంటకాగుతూ, ఆ పార్టీ నాయకులు చెప్పిందే చట్టమన్నట్లుగా పనిచేసే వారినే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలుగా నియమించుకున్నారు. వారిని అడ్డం పెట్టుకొని పోలింగ్ రోజున ప్రతిపక్షాల్ని ఎక్కడికక్కడే కట్టడి చేసే కుట్రలను సిద్ధం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలు చేసిన కుట్రపూరిత చర్యలనే మరింత ఉద్ధృతంగా చేపట్టాలని చూస్తున్నారు. తీవ్ర హింసాత్మక ఘటనలకు పాల్పడి తటస్థులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు, సానుభూతిపరులను ఓటింగ్‌కు రానివ్వకుండా అడ్డుకోవడానికి పథక రచన చేశారు. ప్రతిపక్షాల తరఫున ఏజెంట్లుగా కూర్చునే వారిని బెదిరించటం, వారిపై దాడులు చేయటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న ముసుగులో విపక్షాల వారిని గృహనిర్బంధం చేయించటం వంటి దుశ్చర్యలకు తెగబడేందుకు స్కెచ్ గీశారు. ఈ కుట్ర అమలుకు వీలుగా బందోబస్తు ప్రణాళిక రూపొందించారని చెబుతున్నారు. నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్ గుప్తా తక్షణం ఆ కుటిల వ్యూహాల్ని నిర్వీర్యం చేయాలి. వాటిల్లో భాగస్వాములైన ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలను అక్కడి నుంచి తప్పించాలి. వారిని ఎన్నికల విధులకు దూరంగా పెట్టాలి.
మరో ఇద్దరు అధికారులపై వేటు - ఆదేశాలు జారీచేసిన ఈసీ - Election Commission Transfer
అధికార వైఎస్సార్సీపీ బంటుల్లా పని చేస్తున్న అధికారులు కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీల శ్రేణులను పెద్ద ఎత్తున బైండోవర్ చేస్తున్నారు. వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. కొందరిపై పక్షపాతంగా రౌడీషీట్లు తెరుస్తున్నారు. ఏకంగా హత్యాయత్నం వంటి సెక్షన్ల కింద ఇరికిస్తున్నారు. పాత కేసులను తిరగదోడుతూ బెదిరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేసుకోవటానికి అనుమతులివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైసీపీ నాయకులు దాడులు, దాష్టీకాలు, దమనకాండకు పాల్పడుతుంటే వాటిల్లో ఏ ఒక్క ఘటనలోనూ చర్యలు తీసుకోవట్లేదు. నిందితుల్ని అరెస్టు చేయట్లేదు. పైగా బాధితులపైనే కేసుల నమోదు చేస్తున్నారు.