YS Sharmila Fires on YSRCP : జగన్ అరాచకాలు భరించలేక ప్రజలు ఎన్నికల్లో నిర్ణయాత్మకంగా వ్యవహరించి కూటమికి ఓట్లు వేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదని ఎద్దేవా చేశారు. శాసనసభకు వెళ్లి ప్రజల తరఫున మైకుల ముందు మాట్లాడాలన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
వైఎస్సార్సీపీ నుంచి ఎంపికైన 11 మంది ప్రతిపక్షం కాకపోయినా ప్రజాపక్షం అనిపించుకోవాలని వైఎస్ షర్మిల చెప్పారు. ఆ పార్టీకి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటింగ్ షేర్ తక్కువని కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వమే లేదన్న ఆ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలన్నారు. శాసనసభకు వెళ్లనప్పుడు హస్తం పార్టీకి, వైఎస్సార్సీపీకి తేడా లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారు క్షమాపణలు చెప్పినా వదలకూడదన్నారు. పోస్టులు పెట్టేవారి అరెస్టుల్ని రాజకీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చూడాలని షర్మిల వివరించారు.