AP CM Chandrababu Kept His Promise To Poor Couple :గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ నిరుపేద కుటుంబానికి ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టారు. ఇల్లు నిర్మిస్తానన్న మాటను కేవలం 12 రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. ఈ నెల 1వ తేదీన పెనుమాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు గ్రామానికి చెందిన నిరుపేద పాములు నాయక్ ఇంటికి వెళ్లి పింఛను అందజేశారు. ఈ సందర్భంగా పాములు నాయక్ తనకు సొంతిల్లు కట్టుకునే స్తోమత లేక పూరి గుడిసెలో ఉంటున్నానని, తమకు ఇల్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. 15 రోజుల్లో ఇంటి పనులు ప్రారంభిస్తామని ఆయనకు సీఎం హామీ ఇచ్చారు.
పేద దంపతుల పరిస్థితికి చలించిపోయి :నిరుపేద వ్యక్తి అడిగిన సహయానికి స్పందించిన చంద్రబాబు వెంటనే ఇల్లు మంజూరు చేసి పత్రాలు అందజేశారు. దీంతో అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి శుక్రవారం పాములు నాయక్ దంపతులతో భూమి పూజ చేయించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేసింది. మంగళగిరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి లోకేశ్ చొరవతో టీడీపీ నేతలు పనులు ప్రారంభించారు. టీడీపీ మండల కార్యదర్శి కొల్లి శేషు ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. తమకు సీఎం ఇచ్చిన మాట ప్రకారం పక్కా ఇంటి నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో ఆ పేద దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.