AP CEO Mukesh Mumar Meena Orders to SPs: రాష్ట్రంలో మూడు చోట్ల జరిగిన రాజకీయ హత్యలు, హింసాత్మకం ఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలోని ఈసీ కార్యాలయానికి రావాలని మూడు జిల్లాల ఎస్పీలను ఎన్నికల ప్రధానాధికారి (Chief Electoral Officer) ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఈసీ కార్యాలయానికి వచ్చి హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలు రఘువీరారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రవి శంకర్ రెడ్డిలకు ఆదేశాలు జారీచేశారు. ఆళ్లగడ్డ, గిద్దలూరులో జరిగిన హత్యలు, మాచర్లలో టీడీపీ నాయకుడి కారు తగలబెట్టిన ఘటనలపై ఈసీ వివరణ కోరింది. ఘటనకు గల కారణాలు హింసకాండ వెనుక గల వ్యక్తులకు సంబంధించి పూర్తి వివరాలతో రావాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
సాయంత్రం 4 గంటలకు రావాలి: గత మూడు రోజుల్లో గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు జరిగాయని, మాచర్లలో వాహనం తగలబెట్టారని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు తన ఎదుట వ్యక్తిగతంగా హాజరై ఈ మూడు హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను ఆదేశించామన్నారు. అసలు ఈ ఘటనలు ఎవరు చేశారు? ఎందుకు జరిగాయి? విచారణలో ఏం తేలింది? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు అనే అంశాలపై వారి నుంచి నివేదిక తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎస్పీలు ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యం అంశం కేంద్ర హోం శాఖ, ఎస్‌పీజీ (Special Protection Group) పరిశీలనలో ఉందన్నారు. దీనిపై పలు రాజకీయ పార్టీలిచ్చిన ఫిర్యాదులను కేంద్ర ప్రభుత్వానికి పంపించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.