AP Caste Census 2024 : ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి వంటి వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప, ప్రభుత్వం మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు. ఇతరచోట్లకు మళ్లించడం వారి గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. ఏపీ సీఎం హోదాలో ఉండి జగన్ ఇదే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులగణన పేరుతో ఇటీవల ఇంటింటికీ వాలంటీర్లను (Volunteer System in AP) పంపి సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రకటించకుండానే, వైసీపీ చేతికి చేరినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది.
Caste Survey in AndhraPradesh : వాటి ఆధారంగానే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక మొదలు ఏ సామాజికవర్గం ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది? వారిని ఎలా బుట్టలో వేసుకోవాలో లెక్కలు వేసుకుంటోందని తెలుస్తోంది. అందుకే కులగణన వివరాలు బహిర్గతం చేయలేదనే చర్చ నడుస్తోంది. సంబంధిత శాఖల అధికారులు మాత్రం ఇంకా సర్వే పూర్తి కాలేదని, మరో 10 శాతం కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉందని చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా సర్వేను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఆగ'మేఘా'లపై అస్మదీయులకు మరో ప్రాజెక్టు - ఎన్నికల ప్రకటనకు ముందే జగన్ మాయ
36 రోజుల సుదీర్ఘ సమయం :దశాబ్దాల తర్వాత ఏపీలో కులగణన చేపడుతున్నామని, దాని ఆధారంగా ఆయా సామాజికవర్గాల తలరాతల్ని మార్చేస్తామంటూ జగన్ మొదలు, ఆయన వందిమాగధులు డబ్బా కొట్టారు. మొదట గతేడాది నవంబరులో సర్వే చేయాలని నిర్ణయించారు. అప్పుడు చేస్తే తాము అనుకున్న లాభం ఉండదనుకున్నారేమోగానీ వాయిదా వేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా 2024 జనవరి 19న ప్రారంభించారు. కులాలను లెక్కిస్తామని చెప్పి ప్రజల ఆస్తులు, విద్యార్హతలు తదితర 20 అంశాలతో కుటుంబాల పూర్తి సమాచారాన్ని సేకరించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో సమగ్ర కుటుంబ సర్వేను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేసింది.