తెలంగాణ

telangana

ETV Bharat / state

మందుబాబులకు కిక్కే కిక్కు- సరసమైన ధరలకే లిక్కర్! - NEW LIQUOR POLICY IN AP

New Excise Policy 2024 in AP : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన మద్యం విధానంలో, సరసమైన ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అలాగే గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది

AP New Liquor Policy 2024
New Excise Policy 2024 in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 10:03 AM IST

AP New Liquor Policy 2024 :ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త అందించింది.మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు జరపనున్నట్లు తెలిపింది. 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నే తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఈవిధానంలో మద్యం రిటైల్‌ వ్యాపారం మొత్తం ప్రైవేట్​కే అప్పగించనున్నారు. ఏపీ వ్యాప్తంగా 3396 వైన్ షాప్స్ ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించనున్నారు. అంటే మరో 396 దుకాణాలను అదనంగా నోటిఫై చేయనున్నారు.

నేడు మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనలు : అక్టోబర్ 4,5 తేదీల్లో కొత్త మద్య విధానం అమల్లోకి రానుండటంతో దుకాణాల కోసం దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. లాటరీ ద్వారా లైసెన్స్‌లు కేటాయించనున్నారు. ఈ విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్‌, సత్యకుమార్ యాదవ్‌, గొట్టిపాటి రవికుమార్‌ సచివాలయంలో సమావేశమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదించగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. నేడు జరగనున్న కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలు పెట్టనున్నారు.

వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్‌ వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించనుండటంతో మళ్లీ చట్ట సవరణ అవసరం కానుంది. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానం ఖరారు చేసే అవకాశం ఉంది. అదే రోజు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

కొత్తగా ప్రీమియం స్టోర్లు :అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ప్రీమియం స్టోర్లనూ ప్రవేశపెట్టాలని సర్కార్ యోచిస్తోంది. అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టని బ్రాండ్లను మాత్రమే అందుబాటులోకి తెస్తామని, నాణ్యమైన మద్యం అందుబాటులో ధరలో ఉండేలా కొత్త విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు.

"సరసమైన ధరలకే మద్యాన్ని అందించేలా నూతన మద్యం విధానం ఉంటుంది. కొత్త మద్యం విధానంపై పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేశాం. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం విక్రయించాలని నిర్ణయించాం. గతంలో అక్రమ మద్యం విధానంతో డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారు. మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులను కేటాయించనున్నాం." - కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ మంత్రి

New Excise Policy in AP : వైఎస్సార్సీపీ హయాంలో విక్రయించిన నాసిరకం మద్యంతో ఐదేళ్లలోనే 56,000ల మంది కిడ్నీ, లివర్‌ సంబంధిత సమస్యల బారిన పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మండిపడ్డారు. నాసిరకం మద్యం తాగి అనేకమంది చనిపోయారని విమర్శించారు . అక్రమ మద్యం విక్రయాల ద్వారా జగన్ రూ.19,000ల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యానికి బానిసలైన వారిని కౌన్సెలింగ్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించేలా కొంత నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పెట్టినట్లు మంత్రులు తెలిపారు.

నిత్యావసర సరకుల ధరలు పైపైకి - దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో - ESSENTIALS RATES HIKE IN TELANGANA

ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే సన్నాహాలు - 8 వేల ఎకరాల భూసేకరణ - Land Acquisition for Future City

ABOUT THE AUTHOR

...view details