AP ASSEMBLY SESSIONS 2024:ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఉదయం 9:46 నిముషాలకు ప్రారంభమైంది. ముందుగా ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్యచౌదరిని నియమిస్తూ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ కార్యదర్శి చదివి వినిపించారు. అనంతరం సభ్యులకు ప్రమాణ స్వీకార సమయంలో అనుసరించాల్సిన నియమాలను, పద్ధతులను సూచించిన బుచ్చయ్య ఆ తర్వాత వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ముందుగా సభానాయకుడు, సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం తీసుకున్నారు. తర్వాత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరితో కరచాలనం చేసిన ఆయన అనంతరం సభ్యులందరికీ నమస్కరిస్తూ తన స్థానంలో ఆశీనులయ్యారు.
పవన్‌కల్యాణ్ ప్రమాణస్వీకారం: చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యతో కరచాలనం చేసి సభ్యులందరికీ నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు. పవన్ తర్వాత అక్షర క్రమంలో మిగిలిన అమాత్యులు వరుసగా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
అసెంబ్లీకి చంద్రబాబు- భువనేశ్వరి ఎలా స్పందించారంటే! - Bhuvaneshwari in CBN Assembly Video
మత్స్యకార వేషధారణలో అసెంబ్లీకి:నర్సాపురం జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మత్స్యకార వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. చేప, వలతో సాంప్రదాయ మత్స్యకారునిగా వినూత్న రీతిలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు.
కూటమి నేతలు నామినేషన్ దాఖలు:172 మంది ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రమాణం చేయలేదు. రేపు ఉదయం పదిన్నర గంటలకు శాసనసభ తిరిగి ప్రారంభం కానుంది. జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావులు తోలి సెషన్లో ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది.
రేపు ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడుని ఎన్నుకోనున్నారు. శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నేతలు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్ పలువురు మంత్రులు కలిసి అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాల కార్యాలయం బ్యాగు కిట్ అందచేశారు. బ్యాగులో అసెంబ్లీ రూల్స్ బుక్, రాజ్యాంగ పుస్తకాలు ఉన్నాయి.
అసెంబ్లీలో తడబడిన జగన్ రెడ్డి- 'ఘోరఓటమి తరువాత ఇదే తొలిసారి - pulivendula mla ys jagan oath
మంత్రుల తర్వాత నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత ప్రమాణం చేయాలి. ఎన్నికల్లో ఘోర ఓటమితో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ఫలితంగా ఆయన కూడా మహిళా శాసనసభ్యుల తర్వాత మిగిలిన సభ్యుల మాదిరిగానే ప్రమాణస్వీకారం చేయాలి. అయితే సీఎం చంద్రబాబు ఈ విషయంలో హుందాతనంగా ప్రవర్తించారు. మంత్రుల తర్వాత జగన్‌ను ప్రమాణస్వీకారానికి పిలవాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు. దీంతో మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం చేశారు.
వెనుక గేటు నుంచి అసెంబ్లీకి: వైఎస్ జగన్ అసెంబ్లీ ప్రాంగణానికి వెనుక గేటు నుంచి చేరుకున్నారు. గతంలో సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వెళ్లేవారు. తరచూ వెళ్లే అమరావతి రైతులు శిబిరం వైపు కాకుండా వెనుకవైపు నుంచి అసెంబ్లీకి చేరుకున్నారు. రాజధాని రైతులు ఎక్కడ నిరసన తెలుపుతారనే భయంతోనో ఏమో గాని మందడం గ్రామం మీదుగా అయన వెళ్లలేదు. సభ ప్రారంభమైన ఐదు నిముషాల తర్వాత వచ్చిన అయన అసెంబ్లీలోకి వెళ్లలేదు. గత ప్రభుత్వంలోని ఉపసభాపతి ఛాంబర్‌లోనే పార్టీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు. తన ప్రమాణ స్వీకారం సమయం వచ్చినప్పుడే సభలోకి అడుగు పెట్టారు. ఎమ్మెల్యేగా సభలో ప్రమాణం చేసి, ప్రొటెం స్పీకర్‌కు అభినందనలు తెలిపి సభలో కూర్చోకుండా తిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేటప్పుడు తన పేరు చెప్పడంలో జగన్ తడబడ్డారు. వైఎస్ జగన్ మోహన్ అనే నేను అని తొలుత పలికిన ఆయన తడబాటు తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణం కొనసాగించారు.
తొలిరోజు సందడిగా శాసన సభ (ETV Bharat)