AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్దం చేసింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశం (BAC)లో అసెంబ్లీ ఎన్నిరోజులు నడపాలన్నది నిర్ణయించనున్నారు. ఎన్నికల హమీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నెల 28వ తేదీన 2025-26వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. దాదాపు 3 వారాల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గత ఎనిమిది నెలల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి, అందిస్తున్న సంక్షేమం, 2047 లక్ష్యాలు, ఆర్థిక ఇబ్బందులు తదితర అంశాలపై గవర్నర్ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను చట్టసభలకు సమర్పించనున్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. 15% వృద్ధి సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంతో తొలుత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను పాత ప్రభుత్వం సభకు సమర్పించింది.
రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా బడ్జెట్: ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఇతరత్రా అంశాల కారణంగా మరో నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్‌ను సమర్పించింది. రాష్ట్ర నావకు ఒక దిక్సూచిలా నిలిచి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులను, అభివృద్ధిని గాడిన పెట్టడంలో ఈ నెల 28న ప్రవేశపెట్టే పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ఎంతో కీలకం కానుంది. ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు, మేనిఫెస్టోలో అంశాలకు ఈ బడ్జెట్‌లో స్థానం కల్పించాల్సి ఉన్నందున, అందుకు తగ్గట్టుగా దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. హామీల అమలుకు తగ్గట్టుగా వనరుల సమీకరణ ఇక్కడ కీలకం కానుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
కేంద్ర పథకాలను వీలైనంతగా వినియోగించుకుని: ముఖ్యమంత్రి ఆర్ధికశాఖ అధికారులతోను, ఆర్ధిక మంత్రితోను బడ్జెట్ రూపకల్పనపై ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించిన మంత్రులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో బడ్జెట్ ప్రతిపాదనలపై కూలంకషంగా చర్చించారు. ఆయా శాఖల్లో వారి ప్రాధాన్యాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు ప్రకారం బడ్జెట్ రూపకల్పన చేసినట్లు సమాచారం. శాఖల వారీగా వారి ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ఆర్థిక చిత్రం పరిమితులు కూడా తెలుపుతూ ఎన్నికల హామీల ప్రకారం బడ్జెట్ రూప కల్పన, అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలను వీలైనంతగా వినియోగించుకుని కేంద్రం నుంచి నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. విద్యా, వైద్య శాఖల ద్వారా కేంద్రం నుంచి అదనపు నిధులు లభించవచ్చని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు
సూపర్ సిక్స్ పథకాలకు కేటాయింపులు:గత ఏడాది జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పంపిణీ చేస్తుండటంతో పాటు దీపం-2, అన్న క్యాంటీన్లు ఇప్పటికే ప్రారంభించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను వాడేయటంతో పాటు మూలధన వ్యయానికి ఖర్చు చేయకపోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ఆదాయం తగ్గింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేయడం కొంతమేర ఊరటనిచ్చింది. ఈ ఏడాది నుంచి సూపర్ సిక్స్ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నందున బడ్జెట్‌లో అందుకు తగ్గ కేటాయింపులపై కీలకం కానున్నాయి.