TGNAB New Police Stations in Hyderabad :రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల రవాణా, సరఫరా, వినియోగం పెరుగుతోంది. రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తురిస్తున్న డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. ఇప్పటికే ఏర్పాటైన తెలంగాణ యాంటి నార్కొటిక్స్ బ్యూరో-టీజీన్యాబ్ డ్రగ్ నేరగాళ్లను ఏరివేస్తోంది. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌కి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గంజాయి, డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్ధాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఆ విషయంలో మరింత యాక్టివ్‌గా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోకి మత్తుపదార్ధాలు రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘాఏర్పాటు చేయాలన్న సీఎం, గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్‌కి బ్రేక్ వేయాలని ఆదేశించారు. వాటిని సరఫరా చేయాలంటేనే భయపడేలా చర్యలుండాలని స్పష్టంచేశారు. మత్తుపదార్ధాల కేసులో ఎంత పెద్ద వారున్నా ఉపేక్షించొద్దని స్పష్టంచేశారు.
ఇప్పటికే టీజీన్యాబ్ పనితీరును సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. డైరెక్టర్‌గా ఉన్న సందీప్ శాండిల్యా పదవీకాలం పూర్తవుతుండగా మరోఏడాది పాటు ఆయన సేవలను వినియోగిచుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టీజీన్యాబ్ కోసం రాష్ట్రంలో నాలుగు నార్కొటిక్ ఠాణాలు ఏర్పాటుచేస్తున్నారు. సైబరాబాద్,రాచకొండ, హైదరాబాద్, వరంగల్‌లో పోలీస్‌స్టేషన్లు సిద్దమవుతున్నాయి. కేసులు నమోదు చేసేందుకు కోర్టు అనుమతి లభించడంతో వేగంగా పనులు పూర్తవుతున్నాయి.
ప్రతిఠాణాకి ఎస్‌హెచ్‌వోగా ఇప్పటికే డీఎస్పీని కేటాయించారు. హైదరాబాద్ నార్కొటిక్ ఠాణాను నాంపల్లిలోని హైదరాబాద్ పాతకలేక్టరేట్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే భవనాన్ని అధునీకీకరణ చేస్తున్నారు. సైబరాబాద్ నార్కొటిక్స్ ఠాణా కోసం హఫీజ్ పేటలో కొంతస్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. రాచకొండ నార్కొటిక్స్ ఠాణాకు సరూర్‌నగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్ సమీపంలోని స్థలం కేటాయించారు.