AP High Court on YSRCP Offices Demolition: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాల భవనాల విషయంలో చట్ట నిబంధనలను పాటించాలని అధికార యంత్రాంగాన్ని హైకోర్టు ఆదేశించింది. చట్టం నిర్దేశించిన మేరకు ప్రతి దశలో వైఎస్సార్సీపీ వర్గాల వాదనలు చెప్పుకునేందుకు, వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు భవనాల కూల్చివేత విషయంలో తొందరపాటు చర్యలొద్దని తెలిపింది.
వైఎస్సార్సీపీ భవనాల నిర్మాణ సమయంలో చోటు చేసుకున్న ఉల్లంఘనలు ప్రజాహితంపై ప్రభావం చూపుతున్నప్పుడు, పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణం అయినప్పుడు, ప్రజా భద్రతకు, ఆయా ప్రాంత నివాసులకు ప్రమాదకరంగా ఉన్నప్పుడు మాత్రమే కూల్చివేత అధికారాన్ని వినియోగించాలని అధికారులకు స్పష్టం చేసింది.
ఉల్లంఘనలు స్వల్పమైనప్పుడు, ప్రజలపై ప్రభావం చూపనప్పుడు ఆ భవనాలను కూల్చేందుకు అధికారులు చర్యలు చేపట్టవద్దని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనం ఇమిడి లేనప్పుడు భవనాల కూల్చివేత అధికారాన్ని వినియోగించవద్దని అధికారులను ఆదేశించింది. ఉల్లంఘనల విషయంలో వివరణ కోరుతూ ఇప్పటికే జారీ చేసిన ఉత్తర్వుల విషయంలో చట్ట నిబంధనలను అధికారులు పాటించాలని తెలిపింది. పిటిషనర్లు రెండు వారాల్లో అధికారులకు వివరణ ఇవ్వొచ్చని పేర్కొంది.
వైఎస్సార్సీపీ కార్యాలయాలపై హైకోర్టులో విచారణ - అప్పటివరకు స్టేటస్ కో పాటించాలని ఆదేశం - AP High Court orders On YCP Offices
వాదనలకు బలం చేకూరే సాక్ష్యాధారాలు, దస్త్రాలను అధికారులకు సమర్పించొచ్చని సూచించింది. వివరణలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అధికారులు విచారణను ప్రారంభించాలని హైకోర్టు తెలిపింది. రికార్డులన్నీ పరిశీలించాక ఆయా భవనాల వ్యవహారంలో తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ఆదేశించింది. విచారణ పెండింగ్‌లో ఉండగా ఆయా భవనాల విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. అధికారులను ఆశ్రయించడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను పిటిషనర్లు సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.
చట్టనిబంధనలకు లోబడి నిష్పక్షపాతంగా విచక్షణాధికారాలను వినియోగించి అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అనుమతి పొందకుండా నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయ భవనాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని కోరుతూ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా నోటీసులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వివిధ జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. మొత్తం 21 పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తి, ఇటీవల తీర్పును వాయిదా వేశారు. నిర్ణయాన్ని ప్రకటిస్తూ చట్ట నిబంధనలను పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఆక్రమించిన స్థలంలో వైకా'ప్యాలెస్‌లు' - అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన - Notice to YSRCP Office in Peddapadu