Fee Reimbursement Amount Issue :ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు రాకపోవడంతో విద్యార్థుల పేద తల్లిదండ్రులు అప్పులు చేసి కళాశాలలకు ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వం వద్ద రూ.14వేల కోట్లు ఉంటే ఏం చేయాలి? వీరిని ఆదుకోవాలి కదా? కానీ, వీరికి డబ్బులు ఇచ్చేందుకు సీఎస్‌కు, ఆర్థికశాఖకు చేతులు రావట్లేదు.
ఎన్నికల కోడ్‌కు ముందు ఒక విడత విడుదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కారు. ఆ డబ్బులైనా వస్తాయనుకుంటే అవీ ఇవ్వడం లేదు. పోలింగ్ ముగియడంతో ఇక వారితో పనేముందని అనుకుంటున్నారేమో గానీ, పేదలు అప్పులు చేసి ఫీజులు కడుతున్నా అధికార యంత్రాంగం మనసు కరగడం లేదు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుందనే ఆశతో పిల్లల్ని ఉన్నత విద్యలో చేర్పించారు. విద్యా సంవత్సరం ముగియడంతో ఫీజు మొత్తం చెల్లించాలని కళాశాలలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం నిధులు ఉన్నా విద్యాదీవెనకు విడుదల చేయట్లేదు. ఈ బకాయిలన్నీ కొత్త ప్రభుత్వంపైకి నెట్టేసేందుకే ప్రయత్నిస్తోంది. పీజీ కోర్సుల బకాయిలు రూ.450 కోట్ల వరకు ఉన్నాయి. డబ్బులు లేక చాలామంది పీజీ విద్యార్థులు సర్టిఫికెట్లు కళాశాలల్లోనే వదిలేశారు.
కొత్త ప్రభుత్వంపైనే భారం :2023-24 విద్యా సంవత్సరానికి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులను విడుదల చేయాల్సి ఉండగా ఫిబ్రవరిలో సీఎం జగన్ ఒక విడతకు బటన్ నొక్కారు. ఈ డబ్బులూ తల్లుల ఖాతాల్లో పడలేదు. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు. విద్యాసంవత్సరం ముగిసింది. దీంతో నాలుగు త్రైమాసికాలకు కలిపి రూ.2,832 కోట్ల భారం జూన్ 4 తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వంపైనే పడుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద గత ప్రభుత్వాలు ఫీజుల డబ్బులను నేరుగా కళాశాలల యాజమాన్యాల ఖాతాల్లో వేసేవి. కానీ, తల్లుల ఖాతాల్లో వేసే విధానాన్ని జగన్ తెచ్చారు.
పీజీ బిల్లులు చెల్లించకుండా ఒత్తిడి :పీజీ కోర్సులకు ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని 2020-21 నుంచి జగన్ ప్రభుత్వం నిలిపివేసింది. పీజీ కళాశాలలకు చెల్లించాల్సిన రూ.450 కోట్లు చెల్లించకుండా వన్‌టైం సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించింది. బకాయిల్లో 75% ఇస్తామని, దీనికే అంగీకరించాలంటూ వారిపై ఒత్తిడి చేసింది. ఈ మొత్తం చాలని, దీనిపై న్యాయస్థానాలకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు తీసుకుంది. కానీ, 75% కూడా ఇవ్వలేదు.