Second Day Assembly Sessions in AP 2024 : రాష్ట్ర 16వ శాససభ సభాపతిగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఆయన మాత్రమే ఉండటం, ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో అయ్యన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్యచౌదరి ప్రకటించారు. వెంటనే సభానాయకుడు చంద్రబాబు నాయుడు సహా పవన్ కల్యాణ్, సత్యకుమార్, అచ్చెన్నాయుడు అయ్యన్నపాత్రుడిని అభినందించి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.
నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం : అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా, అనకాపల్లి ఎంపీగా ఒకసారి అయ్యన్నపాత్రుడు విజయం సాధించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఐదు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1983లో నందమూరి తారకరామారావు పిలుపు మేరకు రాజకీయ రంగప్రవేశం చేసిన అయ్యన్న ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీకి, రెండుసార్లు పార్లమెంట్‌కు పోటీ చేశారు.
Chandrababu on Ayyanna Patrudu : నూతన సభాపతిగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారాలోకేశ్, అచ్చెన్నాయుడు సహా ఇతర సభ్యులంతా అభినందనలు తెలిపారు. ఆయన విలక్షణ వ్యక్తిత్వం, పార్టీపట్ల అంకితభావాన్ని చంద్రబాబు కొనియాడారు.
‘66 ఏళ్ల వయసు ఉన్నా అయ్యన్నపాత్రుడు ఇప్పటికీ ఫైర్ బ్రాండే. నీతి, నిజాయతీ, నిబద్ధతను పుణికి పుచ్చుకొని రాజకీయాలు చేశారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయనపై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టి వేధించారు. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు. ఆయన చట్టసభకు రావడం అరుదైన గౌరవం. మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుంది, - సీఎం చంద్రబాబు