Amaravati Farmers Movement Ended :ఎన్నో కష్టాలు, మరెన్నో కన్నీళ్లు, అడుగడుగునా అవమానాలతో ఐదేళ్లుగా నలిగిపోయిన అమరావతి ప్రజలు కూటమి ప్రభుత్వ స్థాపనతో ఊపిరి పీల్చుకున్నారు. పెద్దాయన రాగానే తమకు పెద్ద పండుగ వచ్చిందంటూ సంబరాలు జరుపుకున్నారు. నవ్యాంధ్ర రాజధానిగా పురుడు పోసుకున్న అమరావతిని పసికందుగా ఉన్నప్పుడే గొంతు నులిమేయాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేసింది.
రాజధాని మార్చబోమని అధికారంలోకి వచ్చిన జగన్ 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో 3 రాజధానుల ప్రకటన చేశారు. దీంతో అమరావతి పరిరక్షణ ఉద్యమానికి రైతులు అంకురార్పణ చేశారు. రాజధానిలోని 29 గ్రామాల్లోనూ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి ఆందోళనలు నిర్వహించారు. ఈ క్రమంలో సుమారు 3 వేల మంది రైతులు, మహిళలు, ఉద్యమకారులపై 720కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ అణచివేతను, పోలీసుల దమనకాండకు రైతులు ఎదురొడ్డి నిలబడ్డారు.
'న్యాయస్థానం నుంచి దేవస్థానం' :అమరావతి పరిరక్షణకు రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు 2021 నవంబరు 1న 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' వరకు పేరుతో తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేశారు. దానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ప్రభుత్వం అక్కసు ప్రదర్శించింది. అడుగడుగునా ఆంక్షలు పెట్టింది. అనేక ఇబ్బందులు పెట్టింది. అయినా రైతులు బెదరకుండా పాదయాత్ర పూర్తి చేశారు. అమరావతి పరిరక్షణ ఉద్యమం వెయ్యో రోజుకు చేరిన సందర్భంగా 2022 సెప్టెంబరు 12 నుంచి రాజధాని రైతులు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి దారిపొడవునా వైఎస్సార్సీపీ నాయకులే వారికి అడ్డుతగిలారు. రామచంద్రపురం వరకు యాత్ర చేసిన రైతులు ప్రతికూల పరిస్థితుల్లో అక్కడితో నిలిపివేశారు. అయినా తమ గళాన్ని వినిపిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి బుధవారం ప్రభుత్వాన్ని స్థాపించింది. దీంతో రైతులు తమ పోరాటానికి ముగింపు పలికారు.