Union Budget Funds to AP 2024 : గతంలో తెలుగుదేశం హయాంలో అనంతపురం జిల్లాల్లో కియా, రేణిగుంట ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ క్లస్టర్ ఏర్పాటుతో 2 జిల్లాలో అభివృద్ధికి బాటలు పడ్డాయి. శ్రీసిటీ కేంద్రంగా హీరో సంస్థతోపాటు మరెన్నో యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్‌లకు తాగునీరు, విద్యుత్, రహదారులు, రైల్వే తదితర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి మరింత విస్తృతం కానుంది.
Financial Assistance to Rayalaseema : కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్లు కేంద్రంగా మెగా పారిశ్రామికవాడ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక నడవాలో భాగంగా దీనిని అభివృద్ధి చేయాలని ఏపీఐఐసీ ద్వారా 7100 ఎకరాలు సేకరించారు. వైఎస్సార్సీపీ వచ్చాక పదేపదే ఆటంకాలు కల్పించింది. 3100 ఎకరాలే కేటాయించింది. పరిశ్రమలకు నీటి సౌకర్యం కూడా కల్పించలేదు. దీంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. రెండు కంపెనీలు ముందుకొచ్చినా నీరు అందుబాటులో లేక పనులు ముందుకు సాగడం లేదు.
పరిశ్రమల విస్తరణకు అవకాశాలు : ఈ పారిశ్రామికవాడ ఏర్పాటుతో కర్నూల్, నంద్యాల, కడప, తిరుపతి ప్రాంతాల్లో పరిశ్రమల విస్తరణకు అవకాశాలు మెరుగుపడతాయి. చెన్నై-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక నడవాలను కూడా అనుసంధానిస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం, ఓర్వకల్లు అభివృద్ధికి చేయూత అందించాలని కేంద్రానికి ప్రతిపాదించగా ఆమోదం లభించింది.
విశాఖపట్నం- చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో 5760 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు గత సర్కార్ ప్రతిపాదించింది. రూ.25,000ల కోట్ల పెట్టుబడులతో, 75,000ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. అక్కడ రూ.748 కోట్లతో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినా, డిక్సన్ మినహా పెద్ద కంపెనీలేవీ రాలేదు. నీటి సౌకర్యం కల్పించేందుకు బ్రహ్మం సాగర్ నుంచి పైప్‌లైన్ పనులు చేపట్టినా అవీ పూర్తిచేయలేదు.