ALLIANCE LEADERS ELECTION CAMPAIGN: రాష్ట్రంలో కూటమి నేతల ప్రచారం జోరందుకుంది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు. నగరంలోని ఒకటవ రోడ్డు, రెండో రోడ్డు పరిసర ప్రాంతాల్లో భారీ జన సందోహం మధ్య ప్రచారం సాగింది. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ ప్రచారాన్ని సాగించారు. ప్రతి ఒక్కరూ టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కోరారు. అధికారంలోకి వస్తే అనంతనగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు.
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండల కేంద్రంలో ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించి కరపత్రాలు పంపిణీ చేశారు. నిడదవోలు పట్టణంలో 16వ వార్డులో కందుల దుర్గేష్ మూడు పార్టీల శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీతారామరాజు స్ఫూర్తి నేటి పరిస్థితుల్లో ఎంతో అవసరం అని చెప్పారు. గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి తనని, కమలం గుర్తుపై ఓట్లు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐదో వార్డులో ఎన్డీఏ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య విస్తృత ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సమరంలో జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పని చేస్తుండగా, కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారన్నారు. ప్రజలంతా కూటమి వైపు చూస్తున్నాని పేర్కొన్నారు. పొత్తును విచ్ఛినం చేయాలని ఎన్నో కుట్రలకు జగన్ తెరలేపినా కూడా, ప్రజలు కూటమిని ఆదరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోందని తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు.
చిత్తూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్ధి గురజాల జగన్మోహన్ నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిత్తూరు నగరంలోని పలు డివిజన్లలో ఆయన, ఇంటింటా ఓట్లు అభ్యర్థించారు. టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. టీడీపీ అభ్యర్ధి ఎన్నికల ప్రచారానికి జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.