Alla Ramakrishna Reddy Followers Trying to Occupy Land:అధికారంలో లేకపోయినా వైఎస్సార్సీపీ నాయకుల భూ కబ్జాలు ఆగడం లేదు. తాజాగాగుంటూరు జిల్లా మంగళగిరి మాజీ శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు తాడేపల్లిలోని ఓ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా బాధితులు తీవ్రంగా ప్రతిఘటించారు. తాడేపల్లిలోని పాత టోల్గేట్ పక్కనే సుమతి అనే మహిళకు 40 సెంట్లు స్థలం ఉంది. దీనిని ఆక్రమించేందుకు అదే ప్రాంతానికి చెందిన బుర్రముక్క సాంబిరెడ్డి, వెంకటప్పరెడ్డి గత కొంతకాలంగా యత్నిస్తున్నారు. సాంబిరెడ్డి తన మనుషులు నానాజీ, నరేంద్ర, నాగలక్ష్మిలను సుమతి ఇంటిపైకి పంపించారు. వారి ఇంట్లోని సామాన్లను చెల్లాచెదురుగా పడేసి భయభ్రాంతులకు గురి చేశారు.
ఈ స్థలాన్ని తమకు విక్రయించాలని ఒత్తిడి చేశారు. అంతలో సమాచారం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు సుమతి ఇంటికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు వచ్చి దాడికి యత్నించిన వారిని అదుపులోకి తీసుకొని స్టేషన్కి తరలించారు. గత కొంతకాలంగా తమ ఇంటిని ఖాళీ చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్కే ప్రధాన అనుచరులు బుర్రముక్కు సాంబిరెడ్డి మనుషులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితురాలు సుమతి వాపోయారు. వైఎస్సార్సీపీ హాయంలో స్థలం ఖాళీ చేయనందుకు తనపై 11 కేసులు పెట్టారని సుమతి వాపోయారు.