Andhra Pradesh Air Quality Index :పీల్చే గాలే విషతుల్యమైతే ప్రాణికోటి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ప్రఖ్యాత వైద్యజర్నల్ ‘లాన్సెట్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి వంటి పది మహానగరాల్లో నిత్యం 7% అకాల మరణాలకు కలుషిత గాలే కారణం. ఇప్పటి వరకు వాయుకాలుష్యం అంటే మహానగరాలకే పరిమితం అనుకునేవారు. ఇప్పుడా పరిస్థితి చిన్న పట్టణాల్లోనూ మొదలైంది.
రాష్ట్రంలో వాయునాణ్యత అంతకంతకూ దిగజారుతోంది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్‌ఈఏ) గణాంకాల ప్రకారం గతేడాది సెప్టెంబరులో దేశంలోనే అత్యంత కలుషిత నగరాల జాబితాలో (టాప్-10) విశాఖపట్నం ఆరు రోజులు, విజయవాడ మూడు రోజులు నిలిచాయి. రాష్ట్రంలోని 26 నగరాలు, పట్టణాలు 30 రోజుల వ్యవధిలో టాప్-67లో కనీసం ఐదుసార్లు ఉన్నాయి. జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో రాష్ట్రంలోని 13 నగరాలు విఫలమైనట్టు జాతీయ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గుర్తించింది. వీటిలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి.
దేశీయంగా 2026 నాటికి 131 నగరాల్లో సూక్ష్మ ధూళికణాల సాంద్రతను 40% తగ్గించాలని కేంద్రం ఐదేళ్ల కిత్రం జాతీయ వాయుశుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ లక్ష్యసాధనలో పురోగతి లేకపోగా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పరిస్థితి మరింత దిగజారిందని కాలుష్య నియంత్రణ మండలి తేల్చింది.
నాసిరకంగా వాయు నాణ్యత సూచీ :నిర్ణీత సమయంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఓజోన్ స్థితి, గాలిలోని ధూళిరేణువులు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణాన్ని బట్టి గాలి నాణ్యతను లెక్కిస్తారు. వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 0-50 మధ్య ఉంటే గాలి స్వచ్ఛంగా ఉన్నట్లు, 51- 100 ఉంటే ఓ మోస్తరుగా, 101-200 మధ్య నాసిరకంగా, 201-300 ఉంటే అనారోగ్యకరంగా, 301-400 ఉంటే తీవ్రంగా, 401-500 మధ్య ఉంటే అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు లెక్కిస్తారు. రాష్ట్రంలో సగటు ఏక్యూఐ 110-140 మధ్యలో ఉంటుంది.