AIIMS Mangalagiri First Convocation: యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అత్యాధునిక సేవలు అందిస్తున్న ఎయిమ్స్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు, సంస్థ దేశంలోనే నెంబర్ -1గా ఉండాలని ఆకాంక్షించారు. అందుకు ఎయిమ్స్ సిబ్బంది కృషి చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ (All India Institute of Medical Sciences) తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదట ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎయిమ్స్‌కు చేరుకుని మొదటి బ్యాచ్‌గా వైద్య విద్యపూర్తి చేసుకున్న 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రతాప్రావు జాదవ్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్, సంధ్యారాణి పాల్గొన్నారు.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సేవలందించాలి: వైద్యవృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం, వారి సహకారం దేశం అభివృద్ధి చెందిన సమాజంగా మారుతున్నట్లు నిరూపిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చెప్పారు. యువ వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. యువ వైద్యులు గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు.
సేవ ద్వారా యువ వైద్యులు కీర్తిప్రతిష్టలు పొందాలని, మన దేశం వైద్య సేవలలో ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకోవడంలో వీరి పాత్ర మరువలేనిదని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. ఆరోగ్యకరమైన అభివృద్ధి సాధించే దేశం మన అందరి కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు.
మంగళగిరి ఎయిమ్స్‌కు వారే బ్రాండ్ అంబాసిడర్లు: తన ప్రసంగంలో ముందుగా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామికి వేదికపై నుంచి నమస్కారం చేశారు. దేశ ప్రజలందరిపైనా ఎల్లవేళలా పానకాల స్వామి అనుగ్రహం ఉండాలని కోరారు. నరసింహస్వామి క్షేత్రం చెంతన వైద్య విద్య అభ్యసించిన విద్యార్ధులతోపాటు, వారికి బోధించిన అధ్యాపకులు చాలా అదృష్టవంతులని రాష్ట్రపతి అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పట్టాలు పొందిన వైద్య విద్యార్దుల్లో ఎక్కువ మంది యువతులు ఉండటం చాలా సంతోషకంగా ఉందని, మంగళగిరి ఎయిమ్స్‌కు మొదటి బ్యాచ్ విద్యార్ధులే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.