Agency Invites Nature Lovers to visit Beauties of Alluri District :ప్రకృతే చీర కట్టుకుందా అన్నట్లు అబ్బురపరిచే పచ్చదనం, కాఫీ తోటలు చూపు తిప్పుకోనివ్వని మంచు గిరులు, జల సవ్వళ్లు. ఇలా ఒకటేమిటి ఎన్నో సుందర మనోహర దృశ్యాలు. వింటేనే మనసు పులకరించిపోతుంది కదూ. వీటన్నింటికీ నెలవైంది అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ప్రతీ ప్రాంతమూ మణిహారమే. అడుగడుగునా ఏ మూల చూసినా ప్రతీదీ అద్భుతమే. సీజన్ ఏదైనా ఏజెన్సీ అందాలు ప్రకృతి ప్రేమికులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.
మన్యమంతా దాగి ఉన్న అందాలు : పర్యాటకమంటేనే అల్లూరి జిల్లా. ప్రకృతి రమణీయత సందర్శకుల మదిని దోచుకుంటుంది. ఎన్నో సినిమాలకు నెలవుగా పేరుగాంచి అందాలతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా అనంతగిరి బొర్రా గుహలు, సుంకరమెట్ట కాఫీ తోటలు, పద్మాపురం గార్డెన్స్, గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతం, వంజంగి కొండలు, లంబసింగి దృశ్యాలు ఇలా మన్యమంతా దాగి ఉన్న అందాలు ఆకట్టుకుంటున్నాయి.
నల్లమలలో సరికొత్త జల పర్యాటకం - అబ్బురపరిచే దృశ్యాలతో మరో టూరిస్ట్ స్పాట్
పరవశించిపోతూ ఫొటో షూట్‌లు :అరకులోయ కాఫీ తోటల్లో తీగల్లా అల్లుకున్న పచ్చదనం, మధ్యలో చెక్కలతో కట్టిన వంతెనలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. భూమి మీద పరిచిన తివాచీలా పద్మాపురం బొటానికల్ గార్డెన్ ఆహ్లాదాన్ని పంచుతోంది. రకరకాల చెట్లు, రంగురంగుల పూలను చూసి సందర్శకులు పరవశించిపోతూ ఫొటో షూట్‌లు చేస్తున్నారు. చిరకాలం గుర్తుండేలా జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించి మైమరచిపోతున్నారు.
సందర్శకుల మదిలో మరపురాని అనుభూతులు : మన్యంలో మరో పర్యాటక మణిహారం డుంబ్రిగూడ చాపరాయి జలపాతం. చాపలా జాలువారే జలసవ్వళ్లలో సందర్శకులు జలకాలాడుతూ ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. పాడేరు సమీపంలోని వంజంగి కొండల గురించి చెప్పనక్కర్లేదు. అదో భూలోక కైలాసం. ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు ప్రాణాలకు తెగించి సాహసం చేసి మరీ కొండలెక్కి మరో ప్రపంచానికి వెళ్తుంటారు. అక్కడ ఉదయించే సూర్యుడు తేలియాడే పొగ మంచు సందర్శకుల మదిలో మరపురాని అనుభూతులు నింపుతోంది. ప్రభుత్వం పర్యాటకంపై దృష్టి సారించి మరిన్ని మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు.
స్వర్గాన్ని నేరుగా చూస్తున్నామంటున్న యువత - తెల్లవారకముందే అక్కడికి చేరుకుంటేనే!
ఏపీలో మరో 'ఊటీ' - చేతికందుతూ ఓలలాడించే మేఘాలు