Adilabad Road Widening Work Delay : ఆదిలాబాద్‌ను ఆనుకుని ఉన్న దస్నాపూర్ వంతెన నుంచి మావల గ్రామం వరకు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. మధ్యనున్న డివైడర్లతో ఇరువైపులా ఏడు మీటర్ల చొప్పున ఉన్న రహదారిని అదనంగా మరో 4 మీటర్ల చొప్పున విస్తరించాలని రెండేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన పనుల కోసం రూ.13.64కోట్ల నిధులను సైతం మంజూరు చేసింది.
దస్నాపూర్ నుంచి మావల మార్గంలో భారీ వాహనాలు వెళ్లేలా ఒక్కవైపునే గుత్తేదారు రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేశారు. మావల నుంచి దస్నాపూర్ వైపు వచ్చే మరోవైపు పనులను రెండేళ్లుగా పూర్తి చేయడం లేదు. రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో వాహనాదారులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
"ఆదిలాబాద్ నుంచి మావాల గ్రామానికి ఆరు లైన్ల రోడ్డు మంజూరైంది. ఒక వైపు రోడ్డు పూర్తైన మరోవైపు మాత్రం అలానే వదిలేశారు. ఆదిలాబాద్‌కు రావాలంటే దానికి ఎంట్రన్స్ వచ్చి మావల గ్రామమే. కానీ సగం సగం రోడ్ల నిర్మాణంతో ఎక్కడిక్కడే మట్టి వదిలేశారు. దానివల్ల అనేక రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇద్దరు మరణించారు."-స్థానికులు
రోడ్డును తవ్వి, మట్టి పోసి వదిలేయడంతో ఎన్నో ప్రమాదాలు : ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో పనుల నిర్వహణ ఇప్పటికే పూర్తికావాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ రోడ్డు నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారు. దీంతో కాస్త వర్షం పడితే చాలు వాహనాలు మట్టిలో కూరుకుపోతున్నాయని వాహనాదారులు వాపోతున్నారు.