ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ అమ్మలా ఇక్కడకి వచ్చా' - విద్యార్థులకు గోరుముద్దలు తినిపించిన నన్నయ వర్సీటీ వీసీ - AKNU VC PRASANNA FEEDING STUDENTS

అమ్మ మనసును కష్టపెట్టొద్దంటూ భావోద్వేగానికి గురైన ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్న శ్రీ - మీ అందరికీ అమ్మలా ఇక్కడకి వచ్చానంటూ వ్యాఖ్య

AKNU VC PRASANNA SREE
AKNU VC PRASANNA SREE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 10:56 AM IST

Updated : Feb 25, 2025, 11:31 AM IST

Nannaya University VC Prasanna Sree Feeding Students: ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా అమ్మ ప్రేమకు హద్దు ఉండదు. అందులోనూ ఏ బిడ్డనైనా తన బిడ్డలా భావించే గొప్ప మనసు కొంతమంది తల్లులకు ఉంటుంది. అందకు నిదర్శనమే ఆదికవి నన్నయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసన్న శ్రీ. ఇటీవలే ఆమె విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా బాలుర, బాలికల వసతి గృహాలను ఆమె సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వసతి గృహంలోని గదులు, వంటశాలలను పరిశీలించారు. భోజనం రుచిగా, శుచిగా ఉండాలని అక్కడి సిబ్బందికి ప్రసన్న శ్రీ సూచించారు. ఈ క్రమంలో మెస్‌లోనే విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు. అక్కడ ఉన్న విద్యార్థినులకు గోరుముద్దలు తినిపించారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని ఆమె సూచించారు. వీసీ ప్రసన్న శ్రీ మమేకమైన తీరుపై విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు.

వీసీ భావోద్వేగం:విద్యార్థులకునన్నయ యూనివర్సిటీ వీసీ ప్రసన్న శ్రీ హితబోధ చేశారు. తన కుమారులను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డను పోగొట్టుకుంటే తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో తనకు బాగా తెలుసని, తన పెద్ద కుమారుడు తేజ్‌ నయన్‌ను 1989లో, చిన్న కుమారుడు సిద్ధార్థ్‌ను 2010లో పోగొట్టుకున్నానని తెలిపారు. ఒక మంచి ఇంజినీరింగ్‌ కాలేజీ కట్టించి ఇంజినీర్లను తయారు చేయాలని తన కుమారుడు చెబుతుండేవాడని గుర్తు చేసుకున్నారు.

దేవుడు తన ఇద్దరు పిల్లలను దూరం చేసి కడుపు కోత మిగిల్చినా, ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని తనకు ఇచ్చాడని అన్నారు. తనలా మరే తల్లి బాధపడకూడదని, ఇక్కడి విద్యార్థులలో ఎవరైనా, ఏ కారణం చేతనైనా గాయపడితే తన మనసుకు కష్టం కలుగుతుందని చెప్పారు. తాను వీసిగా ఇక్కడకి రాలేదని, మీ అందరికీ అమ్మలా వచ్చానని విద్యార్థులతో పేర్కొన్నారు. మీరంతా బాగా చదువుకుని తల్లిదండ్రులకు అండగా నిలవాలంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు అనుభవిస్తేనే మీరు ఈ స్థాయికి వచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

అమ్మ మనసు కష్టపెట్టొద్దు: మీరు ఏ పని చేసినా ముందుగా మీ కుటుంబాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని, చెడు అలవాట్ల జోలికి పోవద్దని తెలిపారు. రోడ్లపై జాగ్రత్తగా ప్రయాణించాలని, ఈ విషయాన్ని తాను ఓ అమ్మగా చెబుతున్నానన్నారు. పిల్లలకు జరగరానిది జరిగితే తల్లుల మనసు విలవిలలాడిపోతుందని, అమ్మ మనసును కష్టపెట్టొద్దంటూ నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.

ఇంజినీరింగ్‌ కాలేజీ విద్యార్థి ఎస్‌. శ్రీకాంత్‌ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, అతడి జ్ఞాపకార్థం సోమవారం వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నన్నయ్య యూనివర్సిటీ వీసీ ప్రసన్న శ్రీ హాజరయ్యారు. శ్రీకాంత్‌ మృతి గురించి తెలుసుకుని బాధపడుతూ, ఇద్దరు బిడ్డలను కోల్పోయి తాను పడుతున్న వేదనను విద్యార్థులతో పంచుకున్నారు.

"అమ్మ డైరీలో కొన్ని పేజీలు" - తొలి నవలతో ప్రశంసలు అందుకున్న టెకీ

విశ్వానికి స్ఫూర్తిదాయకం - తల్లికి దేవాలయం కడుతున్న సిక్కోలు శ్రావణుడు - Temple for Mother in Srikakulam

Last Updated : Feb 25, 2025, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details