Manchu Lakshmi Launches Digital Classrooms in Govt School : తమ పిల్లల కోసం ఏమైనా చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ తమ పిల్లల కోసమే కాకుండా ఇతర పిల్లల కోసం కూడా ఆలోచించే వాళ్లు కొందరు మాత్రమే ఉంటారు. అలాంటి కోవకే చెందుతారు సినీ నటి మంచు లక్ష్మి. విద్యార్థుల కోసం ఆమె ఎంతో కృషి చేస్తూ రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ తాను హీరో అని నిరూపించుకుంటున్నారు. తన కుమార్తెకు అందుతున్న విద్యనే అందరి విద్యార్థులకు అందించాలనే సదుద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వారి కోసం ఎనలేని కృషి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ స్మార్ట్ తరగతులను ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం రోజున సినీ నటి, టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు మంచు లక్ష్మి డిజిటల్ స్మార్ట్ తరగతులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తన కుమార్తెకు అందుతున్న విద్యనే అందరి విద్యార్థులకు అందించాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 51 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నానన్న ఆమె, 3833 విద్యార్థులకు నేరుగా స్మార్ట్ క్లాస్ విద్యను అందిస్తున్నట్లు చెప్పారు.
'మనం ఏం చేసినా పిల్లల కోసమే చేస్తాం. వారి గురించి ఆలోచించి వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తే రేపటి రోజున మనకు అండగా ఉంటారు. చదువు అనేది పిల్లలకు ముఖ్యం. విద్యా దానం కన్నా గొప్పది మరొకటి ఉండదు. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ నుంచి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఈ సంస్థతో విద్యార్థులకు కృషి చేస్తుంటే నాకు ఎనలేని సంతోషం కలుగుతోంది' - మంచు లక్ష్మి, టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు
జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్‌తో భేటీ : జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గద్వాల్, గట్టు, థరూర్, ఐజ, ఎర్రవల్లి, ఇటిక్యాల, వడిపల్లి మండలలో ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు సినీ నటి మంచు లక్ష్మి వెల్లడించారు. డిజిటల్ బోధన పద్ధతి విధానంలో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని పేర్కొన్నారు. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థతోనే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ స్మార్ట్ తరగతుల నిర్మాణం, మౌలిక సదుపాయాలు అందుతున్నాయని వివరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అంతకుముందు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ సంతోష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల ఏర్పాటుకు మంచు లక్ష్మి 'అగ్రిమెంట్'