ACP Uma Maheshwar Rao Case Update : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టైన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరావు కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులకు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. సోదాల్లో భాగంగా ఏసీపీ ఆస్తులు చిట్టా బయటపడగా 8 రోజుల కష్టడి కోరుతూ ఏసీబీ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2014 నుంచి ఉమామహేశ్వరరావు కొనుగోలు చేసిన ఆస్తులను సొంతంగా కాకుండా ఎక్కువగా అత్తామామల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. శామీర్‌పేట్‌లోని ఆర్ఎస్ కన్‌స్ట్రక్షన్‌లో 2022లో విల్లా కోసం పెట్టుబడి పెట్టినట్లు తేల్చారు. 333 చదరపు గజాల స్థలంలో 4,400 చదరపు అడుగుల సూపర్ బిల్టప్ ఏరియాతో నిర్మాణంలో ఉన్న ఈ విల్లా కోసం రూ.50 లక్షలు చెల్లించినట్లు గుర్తించారు.
Uma Maheshwar Illegal Land Assets: 2017లో జవహర్‌నగర్ అయ్యప్ప నగర్ కాలనీ సమీపంలో 255 సర్వే నంబర్లో 3 గుంటల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం రూ.10 లక్షలు చెల్లించగా ఇది మదన్మోహన్ పేరిట విక్రయ ఒప్పందం రూపంలో ఉంది. అలాగే ఘట్‌కేసర్ మండలం ఘన్‌పూర్ గ్రామంలోని స్పారోస్ ప్లివోరాలో 159.22 చదరపు గజాల స్థలంలో ఓపెన్ ప్లాట్ కోసం రూ.19,90,250 చెల్లించి దీన్ని తన అత్త సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఇక్కడే 239.54 చదరపు గజాల ప్లాట్‌ను మామ సతీశ్‌బాబు పేరిట 2020లో రిజిస్టర్ చేయించి దీనికోసం సుమారు రూ.37,54,000 చెల్లించారని గుర్తించినట్లు సోదాల్లో అధికారులు తెలిపారు.
CCS ACP Uma Maheshwar illegal Assets: శామీర్‌పేట్ మండలం తుర్కపల్లిలో సర్వేనం.530లో ఉమామహేశ్వరరావు వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. 2018లో శామీర్‌పేట్‌లో 14 గుంటల వ్యవసాయ భూమిని సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లోని అశోకా ఒర్నాట ఆపార్ట్‌మెంట్‌లో 1385 చదరపు అడుగుల ఫ్లాట్‌ను 2022లో సుశీల పేరిట రిజిస్టర్ చేయించారు. కూకట్‌పల్లి సర్వే నంబర్ 1007లో 200 చదరపు గజాల ప్లాట్‌ను 2017లో సుశీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడిలో ఏడున్నర లక్షల విలువైన 25 సెంట్ల స్థలాన్ని మామ సతీష్ పేరిట 2014లో కొనుగోలు చేశారు.