Accused Committed Suicide: ఏటీఎంలో నగదు నింపే వాహనంలో 66 లక్షల రూపాయలు చోరీ చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఎంఎస్ (Cash Management Services) వాహనంలో నగదు చోరీ జరిగింది. అయితే ఆ కేసులో నిందితుడు మహేశ్ బెయిల్ మీద వచ్చి ఇంటి వద్ద ఉంటున్నాడు. అయితే తాజాగా అతను ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే:ఇటీవలఏటీఎంలో నగదు నింపే వాహనంలో 66 లక్షల రూపాయల నగదు చోరీకి గురైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. భోజనం కోసం వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు సిబ్బంది తెలిపారు. అయితే ఇంత భారీ మొత్తంలో సొమ్మును కేవలం ఒకే వ్యక్తి చాలా కూల్‌గా, అది కూడా రద్దీగా ఉన్న ప్రాంతంలో దోచుకెళ్లడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే చోరీ చేసిన వ్యక్తి ఆ సొమ్మును మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టడం గమనార్హం.
సీఎంఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని, దొంగిలించిన నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు సీఎంఎస్ సెక్యూరిటీ సంస్థ సిబ్బంది నగదును చీమకుర్తి, మర్రిచెట్లపాలెం, దొడ్డవరం, గుండ్లాపల్లి, మద్దిపాడు ప్రాంతాల్లోని వివిధ ఏటీఎంలలో నింపడానికి ఈ నెల 18వ తేదీన మధ్యాహ్నం 68 లక్షల రూపాయలతో ఒంగోలు నుంచి బయలుదేరారు.
మా దారి రహదారి అంటున్న దొంగలు- హైవే వెంట మొబైల్ షాప్‌లో భారీ చోరీ - Huge Theft in Cell Shop in Prakasam
అయితే మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద తమ వాహనాన్ని నిలిపిన సిబ్బంది, వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులోని గదిలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వాహనం తలుపు తెరిచి ఉండటం గమనించి పరిశీలించగా అందులో కేవలం 100 రూపాయల నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. 500 రూపాయల నోట్ల కట్టలు కనిపించలేదు.
తాము తెచ్చిన మొత్తం 68 లక్షల్లో ఏకంగా 66 లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్లూస్‌టీమ్‌తో ఆధారాలు సేకరించి, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి, నగదు తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తి గతంలో సీఎంఎస్ సంస్థలో పనిచేసి మానేసిన మహేశ్‌గా గుర్తించారు.
సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెం గ్రామంలో అతడి ఇంటికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారించగా అతడు నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటికి సమీపంలోని మర్రిచెట్టు తొర్రలో డబ్బును దాచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ మీద వచ్చి ఇంటి వద్ద ఉంటున్న మహేశ్, తాజాగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ - నగలు, డబ్బు మాయం