KTR Filed Lunch Motion Petition in Telangana High Court :మాజీ మంత్రికేటీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఏసీబీ విచారణకు వెళ్లేటప్పుడు లాయర్‌ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు వెళ్లనున్నారు. విచారణ సమయంలో కనిపించే దూరంలో న్యాయవాది ఉంటారని జడ్జి తెలిపారు. లైబ్రరీలో కూర్చుని విచారణను లాయర్ చూడవచ్చని ఏఏజీ వివరించారు. అయితే ఏసీబీ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయించాలన్న కేటీఆర్ తరఫు న్యాయవాది వినతిని న్యాయస్థానం నిరాకరించింది. న్యాయవాదితో కలిసి రేపు విచారణకు వెళ్లాలని హైకోర్టు కేటీఆర్‌కు సూచించింది. రేపటి ఏసీబీ విచారణ తర్వాత ఏమైనా అనుమానాలుంటే మళ్లీ సంప్రదించవచ్చని హైకోర్టు పేర్కొంది.
హైకోర్టులో వాదనలు : ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ విచారణలో భాగంగా కేటీఆర్ తనతో పాటు తన న్యాయవాదిని అనుమతించాలని ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ తరపున న్యాయవాది ప్రభాకర్‌రావు న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. గతంలోనూ లాయర్ అనుమతికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఏపీ రాజకీయ నేత అవినాష్‌రెడ్డి విచారణ సందర్భంగా ఇదే హైకోర్టు అనుమతించిందన్న న్యాయవాది ప్రభాకర్ రావు న్యాయస్థానానికి తెలిపారు.
ఏసీబీపై అనుమానం : గతంలో సీబీఐ దర్యాప్తు కేసులో విచారణ అధికారిపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేశారని, తన వాంగ్మూలాన్ని పూర్తిగా నమోదు చేయడం లేదని, ఆడియో, వీడియో రికార్డింగ్‌ను ఆదేశించినట్లు కేటీఆర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ రావు కోర్టుకు తెలిపారు. ఏసీబీ దర్యాప్తుపైన కూడా అనుమానాలున్నాయని అన్నారు. లగచర్ల దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మరో కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాలను దర్యాప్తు అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగా తారుమారు చేసినట్లు కోర్టుకు వివరించారు. వాదనలను విన్న ధర్మాసనం రేపు విచారణకు న్యాయవాదితో కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది.
ఏసీబీ తరఫున ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. కేటీఆర్‌తో పాటు న్యాయవాదిని అనుమతించొద్దంటూ వాదించారు. అయితే న్యాయవాదిని అనుమతిస్తే సమస్యేంటని ఏఏజీని కోర్టు ప్రశ్నించింది. అనంతరం ముగ్గురి పేర్లను ఇవ్వాలని కేటీఆర్ లాయర్‌కు సూచించింది. అనంతరం విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదావేసింది. ఆ సమయానికి కేటీఆర్ తరపున న్యాయవాది రామచంద్రరావు వెళతారని ఆయన తరపు లాయర్ ప్రభాకర్ రావు తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది. దీంతో రేపు కేటీఆర్, తన లాయర్‌తో కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు.