Police Housing Corporation Chairman AB Venkateswara Rao: ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవలే సస్పెన్షన్ కాలం క్రమబద్ధీకరణ: ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని సైతం క్రమబద్దీకరిస్తూ జనవరి 28వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వైఎస్సార్సీపీ హయాంలో ఏబీవీపై రెండు దఫాలుగా జగన్ సర్కార్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. 2020 ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 2022 ఫిబ్రవరి 7వ తేదీ వరకూ మొదటి సారి, రెండో విడతలో 2022 జూన్ 28 తేదీ నుంచి 2024 మే 30 తేదీ వరకూ మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది.
ఇటీవలే ఏబీవీపై నమోదైన అభియోగాలను సైతం ప్రభుత్వం ఎత్తివేసింది. ఏబీవీపై నమోదైన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని, విచారణను వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఏబీవీ ఉద్యోగ విరమణ చేయటంతో, గత ప్రభుత్వంలో జరిగిన రెండు విడతల సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్టుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ఏబీవీకి చెల్లించాల్సిన వేతనాన్ని, అలవెన్సులను చెల్లించనుంది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత సొమ్ము ఇవ్వాలో ఆ మేరకు ఏబీవీకి ప్రభుత్వం చెల్లించనుంది.