ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి కూలీ కంపెనీ పెట్టేశాడు - మలుపు తిప్పిన 'ఎద్దుల బండి' - BULLOCK CART DOLLS IN DAGGULURU

టేకు చెక్క ముక్కలతో అద్భుతంగా ఎడ్ల బండ్ల తయారీ

Bullock Cart Dolls in Dagguluru
Bullock Cart Dolls in Dagguluru (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2024, 2:19 PM IST

Bullock Cart Dolls in Dagguluru : పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన ఆయన నేడు ఓ కుటీర పరిశ్రమకి యజమానిగా మారారు. దేశ, విదేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగారు. గ్రామాల్లో క్రమేపీ కనుమరుగవుతున్న ఎద్దుల బండిని ప్రతి ఇంట్లో ఉండేలా తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. ఇప్పుడు ఎడ్ల బండి బొమ్మల తయారీలో ఆయనది అందెవేసిన చేయి.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామానికి చెందిన వాసా కోటయ్యది చేనేత కుటుంబం. కానీ ఆ వృత్తికి ఆదరణ కరవై కూలి పనులకు వెళ్లడం ప్రారంభించారు. కానీ చిన్ననాటి నుంచి వ్యవసాయం, ఎద్దుల బండ్లు అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. ఎద్దుల బండ్ల బొమ్మలు ఇంట్లో పెట్టుకునే విధంగా తయారుచేస్తే బాగుంటుందని భావించారు. మొదట్లో ఎద్దులు లేకుండా చిన్న బండి తయారు చేశారు. బండి అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో చుట్టుపక్కల వారు దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు.

దీంతో మరో ఇద్దరు యువకులను తన వద్ద పనిలో పెట్టుకుని ఎద్దుల బండ్ల తయారీలో వేగం పెంచారు. సుమారు 8 ఏళ్ల క్రితం వీటి తయారీని ప్రారంభించిన కోటయ్య ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. మొదట్లో చిన్నగా ప్రారంభమైన వ్యాపారం ఇప్పుడు ఓ కుటీర పరిశ్రమగా మారింది. ప్రజల నుంచి మంచి ఆదరణ, స్పందన రావడంతో వ్యాపారం వృద్ధి చెందింది. దగ్గులూరు పంచాయతీ ఎదురుగా రోడ్డు పక్కనే ఓ దుకాణం ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం కోటయ్య వద్ద 20 మంది పనిచేస్తుండగా వీరిలో ఎక్కువ మంది చేనేత పని వారే. వీరితో పాటు దివ్యాంగులకూ పని కల్పించి కోటయ్య అండగా నిలుస్తున్నారు.

"ఎద్దుల బండ్లు తయారు చేస్తుంటాం. వేరే చోట కూలి పనికి వెళ్లేవాడిని. చిన్ననాటి నుంచి ఎద్దుల బండ్లు అంటే మక్కువ. ఆ విధంగా తొలుత ఎద్దులు లేకుండా చిన్న బండి తయారు చేశాను. బండి అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో చుట్టుపక్కల వారు దాన్ని కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. ఆ తర్వాత ఇంట్లో అలంకరణ వస్తువుగా పెట్టుకునే చిన్న బొమ్మల నుంచి హాల్లో టీపాయ్‌గా పెట్టుకునే వాటి వరకూ పెద్ద ఎత్తున తయారు చేయడం మొదలు పెట్టాను. నాతో పాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నాను." - వాసా కోటయ్య, యజమాని

కోటయ్య తయారు చేసే ఎడ్ల బండ్ల బొమ్మలకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఇంట్లో అలంకరణ వస్తువుగా పెట్టుకునే చిన్న బొమ్మల నుంచి హాల్లో టీపాయ్‌గా పెట్టుకునే వాటి వరకూ పెద్ద ఎత్తున విక్రయిస్తుంటారు. ఫోన్ల ద్వారా ఆర్డర్లను తీసుకుని వినియోగదారులకు ఇష్టమైన రీతిలో తయారు చేస్తుంటారు. చిన్న వయసులోనే పలువురికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న కోటయ్యను చూసి గ్రామంలోని పలువురు ఆయన బాటలోనే వ్యాపారం ప్రారంభించారు.

అరటి చెట్టు వ్యర్థాలను పడేస్తున్నారా? - కాస్త ఆగండి - కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు! - Products From Banana Tree Waste

Environmental Protection: ఆలోచనకు పదును.. మట్టితో అద్భుతాలు

ABOUT THE AUTHOR

...view details