A Young Lady Farming and Supporting Her Family : జయశంకర్ భూపలపల్లి జిల్లా కాసింపల్లికి చెందిన చల్లూరి లక్ష్మీమల్లు, సావిత్రి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరికి ఏడుగురు కుమార్తెలు ఉన్నారు. నలుగురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశారు. కానీ మూడేళ్లుగా ఆ దంపతులకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పొలం దున్నేవారు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తండ్రి కష్టాన్ని చూసి నాగలి పట్టింది మూడో కుమార్తె శ్రీలత. తమకు ఉన్న ఎకరం పొలంతో పాటు, మరో అర ఎకరం కౌలుకు తీసుకొని మూడేళ్లుగా వ్యవసాయం చేస్తోంది. స్వయంగా దుక్కి దున్నడం, ఎరువులు చల్లడం వంటి అన్ని పనులు చేసుకుంటూ, మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పంటలు పండిస్తోంది.
తల్లిదండ్రులకు కుమారుడు లేని లోటును తీరుస్తున్న కుమార్తె : శ్రీలత పదోతరగతి చదివి ఆపేసినా, చెల్లెళ్ల చదువు మాత్రం ఆగనివ్వడంలేదు. ఒక చెల్లెల్ని ఎమ్ఏ, బీఈడీ వరకు చదివించింది. మరో చెల్లెలికి పెళ్లి చేసింది. ఇంకో చెల్లిని ల్యాబ్ టెక్నిషియన్ చదివించి, తన కాళ్లపై తాను నిలబడేలా చేసింది. తమ తండ్రికి కుమారుడు లేని లోటు తీర్చాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తున్నాని శ్రీలత చెప్పుకొచ్చింది.
"నాన్న మాకోసం ఎంతో కష్టపడి, వ్యవసాయం సాగిస్తూ మమ్మల్ని సాకాడు. ఇప్పుడు ఇంకా ఆరోగ్యం సరిగాలేక పంటలు పండించటం కష్టమవటంతో, నాకు నేనుగా తోడునిలవాలని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను పదో తరగతి వరకూ చదివాను కానీ మిగిలిన నా అక్కాచెల్లెలను పై చదువులు చదివించుకుంటున్నాను."-శ్రీలత, రైతు