Sell Gold Biscuits Fraud in AP : ఓ బ్యాంకులో వేలం పాటలో కొన్న బంగారు బిస్కెట్లను విక్రయిస్తున్నానని ఓ మాయలేడి కట్టుకథ అల్లింది. ఇలా అమాయక మహిళల నుంచి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టింది. ఆమెకు వైఎస్సార్సీపీ పలువురు నేతలు సహకరించినట్లు సమాచారం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త ఓ బ్యాంకులో పని చేస్తున్నారని పలువురికి తెలిపింది. బ్యాంకులో వేలం పాటలో పాడిన బంగారు బిస్కెట్లను గతంలో కొనుగోలు చేశామని, డబ్బులు అవసరం కావడంతో ఇప్పుడు వాటిని విక్రయిస్తున్నట్లు వారిని నమ్మించింది. కిలో బంగారు బిస్కెట్లు రూ.10 లక్షలకే ఇస్తానని ఆశ చూపింది. ఇది నమ్మిన టెక్కలి, విశాఖపట్నం, నౌపడ తదితర ప్రాంతాలకు చెందిన మహిళల నుంచి రూ. కోటికి పైగా కాజేసింది.
Srikakulam Women Gold Biscuits Fraud :టెక్కలికి చెందిన పైల దమయంతి నుంచి రూ.37 లక్షలు, నౌపడ గ్రామానికి చెందిన కె.భాగ్యలక్ష్మి నుంచి రూ.35 లక్షలు, బేబీ నుంచి రూ.20 లక్షలు, దాలమ్మ నుంచి రూ.2 లక్షలు వసూలు చేసింది. ఈ క్రమంలో బంగారు బిస్కెట్లు ఎంతకీ ఇవ్వకపోవడంతో బాధితులు రెండు నెలల కిందట మాయలేడిని నిలదీశారు. తులం బంగారానికి 2 తులాల బంగారం అందజేస్తానని, లేదంటే డబ్బు ఇస్తానని మరోసారి ఆశ చూపింది.