Poor Couple Huge Help to orphans :ఆ దంపతులు పుట్టుకతో దివ్యాంగులు, రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. వారికి ముగ్గురు పిల్లలు. కష్టపడి వారిని చదివించి ముగ్గురుకీ పెళ్లిళ్లు చేశారు. ఇప్పుడు పెద్ద బాధ్యతలేవీ లేకపోవడంతో, జీవిత చరమాంకంలో ఉన్న ఆ పేద దంపతులు ఇన్నాళ్లూ దాచుకున్న సొమ్ము రూ. 10 లక్షలను అభాగ్యుల కోసం వెచ్చించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన ముడుంబ విజయభాస్కరాచార్యులు (63) ఇంటర్ వరకు చదువుకున్నారు. 1986లో ఆయనకు వకుళాదేవి (60)తో పెళ్లైంది. ఆయన పౌరోహిత్యం, సైకిల్ రిపేర్ వంటి వృత్తులతో పాటు, ప్రభుత్వం నుంచి వచ్చే దివ్యాంగ పింఛనుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. తమ ముగ్గురు కుమార్తెలు హరిచందన, శ్రీలక్ష్మి భార్గవి, సింధూరిలను సర్కార్ బడులు, హాస్టళ్లలోనే డిగ్రీ వరకు చదివించి వివాహాలు చేశారు.
రూ.10 లక్షలు అన్నం ఫౌండేషన్ పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ : సొంత ఇల్లు కూడా లేని ఆ దంపతులు గత రెండేళ్లుగా సత్తుపల్లిలో చిన్న కుమార్తె సింధూరి వద్ద ఉండి జీవనం సాగిస్తున్నారు. వయసు మీద పడుతుండడంతో తాము దశాబ్దాలుగా రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్న కష్టార్జితాన్ని అనాథలు, అభాగ్యుల ఆశ్రమానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఖమ్మం జిల్లాలోని అన్నం ఫౌండేషన్‌ను సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న అనాథలు, మానసిక దివ్యాంగులకు తమ వంతు సాయం చేయాలని నిశ్చయించుకున్నారు.