Police Thonda in Telangana :బల్లుల గురించి మీకు ఏం తెలుసు చెప్పండి చూద్దాం? అసలు బల్లులు ఎన్ని రకాలో చెప్పగలరా? బల్లికి డైనోసార్‌కి పోలిక ఉందంటే నమ్ముతారా? నిత్యం మనం ఇంట్లో ఉండే బల్లులు ఏ రకానికి చెందినవో తెలుసా? బల్లులు గుడ్లు పెడతాయన్న విషయం మనలో ఎంత మందికి తెలుసు. ఊసరవెల్లి గురించి వినే ఉంటారు. పరిస్థితులకు తగ్గట్టు రంగులను అప్పుటికప్పుడు మార్చుకుంటుంది. కానీ ఇప్పుడు చూసేది రంగు రంగులుగా ఉండే బల్లి జాతే కానీ, ఊసరవెల్లి మాత్రం కాదు. అదేంటని మీకు ఆత్రుతగా ఉంది కదూ. అయితే కింద ఇచ్చిన స్టోరీని చదివేయండి.
బల్లి అంటే కేవలం మన ఇంట్లో గోడకు ఉండే బల్లి మాత్రమే అనుకుంటే పొరపాటు. బల్లికి డైనోసార్‌కు సంబంధం ఉంది. కాలం మారుతున్న కొద్దీ రూపాంతరం చెందినవే ఇప్పుడున్న బల్లులు. అడవుల్లో బల్లుల జాతులు ఉంటాయి. అవి పెద్ద శరీరంతో పాకుతూ పాములాగ నాలుక బయటకు తెరుస్తూ భయం గొలిపిస్తూ ఉంటాయి. అలాగే చాలా రకాల బల్లుల జాతులు ఈ విశ్వంపై ఉన్నాయి. అవి వాటికి తగిన భౌగోళిక పరిస్థితుల్లో నివసిస్తూ ఉన్నాయి. రంగురంగుల బల్లులు కూడా ఉన్నాయి. పరిస్థితులను బట్టి రంగులను మార్చే ఊసరవెల్లీ ఉంది.
కానీ ఈ బల్లి మాత్రం రెండు రంగుల కలయికతో మిక్స్డ్ రంగులో ఉంటుంది. అదే పోలీసు తొండ. ఇది కూడా బల్లి జాతికి చెందినదే. మరి విశేషం ఏంటంటారా? ఇలాంటి అరుదైన తొండ రకం హైదరాబాద్ శివారు కోహెడ గుట్టపై కనిపించింది. తెలంగాణలో పోలీస్ తొండగా పిలువబడే ఈ రకం వివిధ ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. వినడానికే ఈ పేరు వింతగా ఉన్నా, ఇది నిజంగానే పోలీస్ తొండ.