Fake Tehsildar in Telangana Secretariat : తెలంగాణ సెక్రటేరియట్లోకి నకిలీ తహసీల్దార్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. తిప్పర్తి తహసీల్దార్ అని చెప్పి అంజయ్య అనే వ్యక్తి నకిలీ ఐడీ కార్డుతో సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. సచివాలయ భద్రతా సిబ్బందికి అనుమానం వచ్చి వెంటనే అతడిని అడ్డుకున్నారు.
తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయానికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడంతో అంజయ్య నకిలీ తహసీల్దార్ అని తెలిసింది. ఎస్టీఎఫ్( భద్రతా దళం) ఎస్సై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంజయ్య వచ్చిన వాహనంపై కూడా తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని స్టిక్కర్ ఉండటంతో పోలీసులు ఒక్కసారిగా కంగుతిన్నారు.ఇటీవలే ఇలాంటి ఘటన జరిగింది. ఓ వ్యక్తి నకిలీ ఐడీ కార్డుతో సచివాలయంలోకి ప్రవేశించి ఏకంగా సీఎంతో సెల్ఫీదిగేందుకు యత్నించాడు. అనుమానాస్పదంగా కనిపించడంతో సచివాలయ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది.