Man Raising Different Types of Animals Yerragondapalem:ఆ తోటలోకి అడుగు పెట్టినవారికి అక్కడ కనిపించే జంతువులను చూసి ఏదేని విచిత్ర జంతువుల ప్రదర్శనశాలకు వచ్చామా అనే అనుభూతి కలుగుతుంటుంది. మనం రోజూ చూసే సాధారణ పక్షులు, జంతువులకు భిన్నమైనవి అక్కడ కనిపించడమే అందుకు కారణం. అక్కడ రకరకాల జాతులకు చెందిన వింత జంతువులు దర్శమనమిస్తుంటాయి.
విదేశీ బాతులు ఓ వైపు పరుగులు తీస్తుంటే పొడవాటి చెవుల మేకలు, ఎక్కువ ఊలుతో ఉన్న పొట్టి గొర్రెలు మరో వైపు చెంగుచెంగున ఎగురుతుంటాయి. ముచ్చటగొలిపేలా ఉన్న చిట్టి పొట్టి ఆవులు కూడా కనిపిస్తుంటాయి. ఇక కోళ్లలో అయితే అనేక రకాలు కనువిందు చేస్తాయి. వీటన్నింటినీ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఎంతో ఇష్టంతో పెంచుకుంటున్నారు.
జంతువులపై ప్రేమతోనే ఇదంతా: జిల్లాలోని యర్రగొండపాలేనికి చెందిన రువ్వుల శ్రీనివాస్ జంతువులు, పక్షుల ప్రేమికుడు. వృత్తిరీత్యా పర్యటనలకు వెళ్లిన సమయాల్లో అక్కడ ప్రసిద్ధి చెందిన జంతువులు, పక్షుల గురించి కనుక్కొని కొనుగోలు చేస్తుంటారు. స్వగ్రామంలో తనకున్న రెండెకరాల ఫాంహౌస్‌కు తెచ్చి పెంచుతుంటారు. అంతే కాకుండా వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి పొడవాటి చెవులున్న జమునపరి మేకలను, అధిక ఊలుతో ఉన్న పొట్టి గొర్రెలు, బెంగాల్ నుంచి కొన్ని రకాల మేకలను కొనుగోలు చేసి తన ఫాంహౌస్‌కు తీసుకొచ్చారు.