Road Accident In Nellore:రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. ఒక్కో రూపాయి కూడబెట్టుకుని మరీ కూరగాయలను అమ్ముకుంటూ ఆ దంపతులు జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారి జీవితాన్ని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఈ దంపతుల మృతితో వీరి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. నెల్లూరు జిల్లా సంగం మండలంలో గల జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి:నెల్లూరు జిల్లా సంగం మండలం అనసూయనగర్ గ్రామానికి చెందిన వెంకట శేషయ్య, వెంకట వరలక్ష్మి ఇరువురూ భార్యాభర్తలు. వీరు రోజూ మాదిరిగానే ఆటోలో కూరగాయలు వేసుకుని అమ్మేందుకు వెళ్తుండగా అటువైపుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త వెంకట శేషయ్య అక్కడికక్కడే మృతి చెందగా భార్య వరలక్ష్మి సైతం తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.