Fraud in the Name of House Loan : నిరుపేద కుటుంబానికి చెందిన నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించాడు. తియ్యని మాటలతో వారి ఇంటిని ఓ దళారి, తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దళారి చేసిన మోసంతో ఓ కుటుంబం రోడ్డున పడ్డ ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తమ తాతల కాలం నాటి ఇల్లు తమ పేరున లేదని, రుణం చెల్లించలేదని జప్తు కోసం బ్యాంకు అధికారులు రావడంతో మోసపోయామని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేశారు.
బాధితులకు తెలియకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ : వివరాల్లోకి వెళ్తే బేగంపేట పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఉండే భూషణ్ అనే వ్యక్తి కుమార్తె వివాహం కోసం లోన్ ఇప్పించాలని దినకర్ అనే దళారిని సంప్రదించాడు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దినకర్ ప్రైవేటు ఫైనాన్సర్ వద్దకు తీసుకువెళ్లాడు. రుణం కావాలంటే ముందస్తుగా సంతకాలు చేయాల్సి ఉంటుందని చెప్పాడు. వారి ఇంటిని దినకర్ తన భార్య రజినికి విక్రయించినట్లుగా సంతకాలు చేయించుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో ఇంటి యజమాని భూషణ్ వాపోయారు.
ఇంటిని జప్తు చేసేందుకు రావడంతో ఉద్రిక్తత : అక్రమంగా ఇల్లును రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం దినకర్, హైదర్ గూడ మహారాష్ట్ర బ్యాంక్‌లో భూషణ్ ఇంటి పేరిట రూ. కోటి రూపాయలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణానికి ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఈరోజు(ఫిబ్రవరి 04న) మధ్యాహ్నం సమయంలో ఇంటిని జప్తు చేసేందుకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము మోసపోయామని గ్రహించిన బాధిత కుటుంబంలోని భరత్, అనసూయ, భూషణ్‌లు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.