6G NETWORK UPGRADE IN INDIA : ఇంటర్నెట్ నేటి ప్రపంచంలో ఇది ఎంతో కీలకం. వాట్సాప్ మెసేజ్ చేయాలన్నా, యూట్యూబ్‌లో వీడియో చూడాలన్నా, ఆఫీస్‌కు సంబంధించిన మెయిల్ ఓపెన్ చేయాలన్నా అంతర్జాలం అనేది చాలా అవసరం. మెుదట్లో అంటే 1980లలో 1జీ ద్వారా కేవలం ఫోన్లు మాట్లాడుకునే వాళ్లం. ఆ తర్వాత 2జీ ద్వారా 1990లలో వాయిస్ కాల్స్‌తో పాటు మెసేజ్‌లు పంపించడం ప్రారంభమైంది. ఆ తర్వాత పదేళ్లకు అంటే 2000లలో 3జీ వచ్చింది. దీని ద్వారా మెుదటిసారి ఇంటర్నెట్ సేవలు అంటే వెబ్ బ్రౌజింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టాం.
ఐఐటీ మద్రాస్ ఫోకస్ : దీనికి అప్‌డేట్ వెర్షన్‌గా 2010లో 4జీ నెట్‌వర్క్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనలో చాలా మంది వినియోగిస్తుంది ఇదే నెట్‌వర్క్. ఐతే, 2020లలో 5జీ వచ్చింది కానీ, ఇది పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. తర్వాత 5జీని తలదన్నే విధంగా రాబోతున్న 6జీని 2030 నాటికి వినియోగంలోకి తీసుకురాబోతున్నట్లు ఇప్పటికే భారత్ తెలిపింది. దీనికి సంబంధించి పరిశోధనలు ప్రారంభించింది. 5జీకి సహకరించిన ఐఐటీ మద్రాస్ సంస్థే 6జీకి కూడా పని చేయనుంది.
టెలికాం విభాగం విడుదల చేసిన 6జీ డాక్యుమెంట్ ప్రకారం, 5జీ నెట్‌వర్క్ సెకనుకు 10 గిగాబైట్స్ వేగంతో పనిచేస్తే, 6జీ సెకనుకు ఒక టెరాబైట్ వేగంతో పనిచేస్తుంది. ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల పరంగా 5జీ ఆపరేటర్లు 24 గిగాహెడ్జ్ నుంచి 66 గిగాహెడ్జ్ స్పెక్ట్రమ్ వేవ్‌లను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల డేటా బదిలీ వేగంగా జరుగుతుంది. 6జీలో మాత్రం స్పెక్ట్రమ్ వేవ్‌లు 30 గిగా హెడ్జ్‌ల నుంచి 300 గిగాహెడ్జ్‌లను దాటి టెరాహెడ్జ్‌ల వరకు ఉపయోగించవచ్చు.
ఉదాహరణకు వన్ జీబీ ఫైల్ 5జీ ద్వారా 1సెకండ్‌లో డౌన్‌లోడ్ అయితే, అదే 6జీ ద్వారా 1సెకండ్‌కి 100జీబీ అవుతుంది. అంటే మరింత ఎక్కువ స్పీడ్‌తో 6జీ పని చేస్తుంది. 6జీని అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రపంచంలోని అగ్రదేశాలు పరిశోధనలకు సిద్ధమయ్యాయి. ఈ రేసులో ముందుండేందుకు భారత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ రీసెర్చ్ పార్క్‌లో 6జీ సాంకేతికతపై పరిశోధనలు చేసేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 6జీ సాంకేతికతను 2030 నాటికి 2 దశల్లో ప్రజలందరికీ చేరువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యంగా చెబుతున్నారు.