54 Years Old Man Cycling :5 పదుల వయసులోనూ ఆ వ్యక్తి రోజుకు 300 కి.మీ. దూరం సైక్లింగ్ చేస్తున్నాడు. కేవలం 12 రోజుల్లోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3,758 కి.మీ. ప్రయాణించి ఔరా అనిపించాడు. అది కూడా ఒకసారి కాదు, వరుసగా రెండేళ్లు పూర్తి చేసి సత్తా చాటారు హైదరాబాద్ బండ్లగూడకు చెందిన గెయిల్ ఇంజినీరు బొబ్బా రవీందర్ రెడ్డి. కేవలం గంటసేపు సైకిల్ తొక్కితేనే అమ్మ బాబోయ్ నావల్ల కాదంటూ చేతులెత్తేస్తున్న ఈ యువతరం యువతకు ఈ 54 ఏళ్ల వ్యక్తి సాహసం ఆదర్శమేనని చెప్పాలి.
గెయిల్ ఇంజినీరుగా పని చేస్తున్న ఆయన అమెరికాలో వచ్చే ఏడాది జూన్‌లో జరగబోయే 5 వేల కి.మీ. వరల్డ్ లాంగెస్ట్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌నకు అర్హత సాధించారు. ఈ రేసుకు మన దేశం నుంచి ఏటా పలువురు సైనికాధికారులు పాల్గొంటున్నా, మొదటిసారి 50 ఏళ్లు పైబడిన కేటగిరీలో రవీందర్ రెడ్డి పాల్గొంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డి, 1991లో హైదరాబాద్ రామంతపూర్‌లో పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత గెయిల్‌లో ఉద్యోగం సాధించి, యూపీ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పని చేసి చివరికి 2015లో హైదరాబాద్‌లో మార్కెటింగ్ అధికారిగా చేరారు.
ఇలా ఉద్యోగం చేస్తూనే బీటెక్ కెమికల్, ఎంబీఏ పూర్తి చేసి పీహెచ్‌డీలో చేరినా, అనివార్య కారణాల వల్ల మధ్యలోనే ఆపేశారు. డాక్టరేట్ సాధించలేకపోయాననే బాధలో పడ్డారు. ఈ బాధ నుంచి బయటపడేందుకు 2012లో 42 ఏళ్ల వయసులోనే దిల్లీలో మొదటిసారి హాఫ్ మారథాన్ చేశారు. ఆ తర్వాత 10 రాష్ట్రాల్లో 282 మారథాన్లు పూర్తి చేయగా, అందులో హాఫ్ 21.1 కి.మీ., ఫుల్ 42.2 కి.మీ. మారథాన్లు ఉన్నాయి.
గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నించి : గిన్నిస్ బుక్ రికార్డు కోసం ఒకే నెలలో 33 మారథాన్లు చేయగా, అవన్నీ కూడా ఒకే చోటే చేయడంతో గిన్నిస్ బుక్ రికార్డు దక్కలేదు. కానీ హాఫ్ మారథాన్‌లో మాత్రం ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు.