YSRCP Social Media Activists in Varra Ravinder Reddy Case :వర్రా రవీందర్ రెడ్డి కేసులో పలువురు వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు 41-A నోటీసులు జారీ చేయడం ఆ పార్టీలో గుబులు రేపింది. వర్రా పెట్టిన అసభ్యకరమైన పోస్టులతో సంబంధం ఉన్న వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే కేసులో అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సర్చ్ వారంట్ జారీ చేశారు.
వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా వైఎస్‌ఆర్ జిల్లాలోని పలువురు ఆ పార్టీ కన్వీనర్లు, కో కన్వీనర్లకు పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. శనివారం తెల్లవారుజామున పులివెందుల, కడప ప్రాంతాల్లో ఆ పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలైన ఆరుగురి ఇళ్లకు వెళ్లి నోటీసులు అంటించి వచ్చారు. పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సామాజిక మాధ్యమ జిల్లా కన్వీనర్ వివేకానందరెడ్డి ఇంటికి 41A నోటీసు అంటించి వచ్చారు. ఆ సమయంలో వివేకానందరెడ్డి ఇంట్లో లేకపోవడం.. ఆయన భార్యకు సమాచారం ఇచ్చి నోటీసు అంటించి వచ్చారు.
శనివారం ఉదయం 10 గంటలకు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ వివేకానందరెడ్డి విచారణకు వెళ్లలేదు. ఇతనితోపాటు జిల్లా కో కన్వీనర్లు సునీత, నిషాంత్, వర కుమార్ తోపాటు మరో ఇద్దరి ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించగా ఎవరూ హాజరుకాలేదు. దీంతో ఆ పార్టీ న్యాయవాదులు, బాధిత కుటుంబ సభ్యులు పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ ను కలిసి విచారించాలనుకుంటున్న వారి జాబితా అందజేస్తే తామే పోలీసుల ముందు హాజరుపరుస్తామని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.