21 Students Affected by Diarrhea in Nellore District : నెల్లూరు జిల్లాలో డయేరియా బారినపడుతున్న రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా గూడూరు మండలం చెన్నూరు గిరిజన గృహంలో 21 మంది విద్యార్ధులు డయేరియా బారినపడ్డారు. వాంతులు, విరోచనాలతో నెల్లూరు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులల్లో చికిత్స పొందుతున్నారు. హాస్టల్లో విద్యార్థులకు శుద్ధి చేసిన నీరు, నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించినా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాగునీటి వల్ల డయేరియా వ్యాపించిందా, విషపూరిత ఆహారం వల్ల విద్యార్ధులు అనారోగ్య పాలయ్యారా అనే విషయం ఇంతవరకు వెల్లడి కాలేదు. అయితే తాగునీరు కలుషితంతోనే తమ పిల్లలు డయేరియా బారినపడ్డారని తల్లిదండ్రులు చెబుతున్నారు.
పవన్ ఆదేశాలతో అధికారుల్లో కదలిక - డయేరియా నివారణపై చర్యలు - Diarrhea Prevention Measures
జిల్లాలో పల్లెలతో పాటు పట్టణాల్లో తాగునీరు కలుషితం అవుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో నీటి పథకాల నిర్వహణకు సరిగా నిధులు విదల్చలేదు. ట్యాంకుల శుభ్రత, పైపులైన్ల మరమ్మతులను గాలికొదిలేసింది. చాలాచోట్ల పైపులు మురుగు కాలువల్లోనే ఉన్నాయి. ఫలితంగా తాగునీరు కలుషితమై జనం డయేరియా బారిన పడుతున్నారు. డయేరియా ప్రబలేందుకు ప్రధాన కారణం అపరిశుభ్రత, అధ్వాన పారిశుద్ధ్యం.
నెల్లూరునగరం, పట్టణాలు, గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు, గొట్టాల్లోకి మురుగు చేరడం వల్ల తాగునీరు కలుషితమవుతోందని ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నీరు రంగుమారడంతో పాటు దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. తాగునీటిని శుద్ధి చేయకుండానే కుళాయిల ద్వారా సరఫరా చేస్తూ ప్రజారోగ్యంతో యంత్రాంగం చెలగాటమాడుతోంది. పైపులైన్లు, కుళాయిలు, ఇతరత్రా మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా నిర్లక్ష్యం వ్యవహరించడం ప్రజలకు శాపంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడాన్ని అధికారులు విస్మరించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.