Students Sick with Poor Quality Food :వసతి గృహంలో సరైన భోజనం లేక 20 మంది బాలికలు అస్వస్థతకు గురయిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ఆదర్శ బాలికల పాఠశాలలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా వసతిగృహంలో ఉడికీ ఉడకని అన్నం, నాసిరకం కూరలు, నాణ్యత లేని భోజనం పెడుతుండటంతో సరిగా భోజనం చేయడం లేదని విద్యార్థినులు పేర్కొంటున్నారు. గడిచిన 2 రోజుల నుంచి విద్యార్థులు భోజనం చేయకపోవడంతో ఇవాళ తీవ్ర కడుపునొప్పితో వెల్దండ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చేరారు.
మంచినీటి గోస : మరి కొంతమంది విద్యార్థినులను తల్లిదండ్రులు తమ ఇళ్లకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పీడీఎస్యూ, ఎన్ఎస్యూ విద్యార్థి సంఘాల నాయకులు వసతి గృహానికి చేరుకొని బాలికల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో వండుతున్న భోజనం అస్సలు బాగోలేదని పురుగుల అన్నం, నాసిరకం కూరలతో ఆహారం పెడుతున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఆహారం మాత్రమే కాదు, హస్టల్లో తాగడానికి శుద్ధి చేసిన మంచినీళ్లు కూడా లేవని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు సైతం నీటి సమస్య ఉందని పేర్కొన్నారు.
వసతుల లేమి : హాస్టల్లో భోజనం బాగోలేక అస్వస్థతకు గురైతే ప్రభుత్వాసుపత్రి కూడా దగ్గరలో లేదని, ప్రైవేటు ఆసుపత్రులను వెళ్లాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోయారు. హస్టల్లోనే వైద్యం అందించేందుకు స్టాఫ్ నర్సు ఉండాలని, అత్యవసరమైతే వెంటనే వెళ్లడానికి వాహన సౌకర్యం కావాలని విద్యార్థినులు కోరుతున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లకు సరైన తలుపులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.